జనాలకు పిచ్చెక్కించేస్తున్నారా..?
ఇక్కడ గమనించాల్సిందేమంటే అన్నీసీట్లలోనూ జనసేన నామినేషన్లు వేస్తుందంటే అర్థమేంటి..? టీడీపీతో పొత్తుండదనే కదా. అలాగే మిత్రపక్షమైన బీజేపీతో కూడా సంబంధాలు తెంపుకోవాలని అనుకుంటున్నారా..? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
అభిప్రాయాలు మార్చుకోలేని వాళ్లు పొలిటీషీయన్లు కాలేరని వెనకటికెవరో అన్నారు. బహుశా ఆ నానుడి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బాగా నచ్చినట్లుంది. అందుకనే రోజుకో అభిప్రాయం మార్చేసుకుంటున్నారు. తాజా ప్రకటనతో జనాల్లో పిచ్చెంక్కించేస్తున్నారు. అభిప్రాయాలను ఇంతస్పీడుగా మార్చుకుంటున్న నేత ఇంకెవరూ లేరేమో. మొన్నటివరకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనిచ్చేదిలేదంటూ రచ్చరచ్చ చేశారు. ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ బహిరంగ సభ జరిగినా ఇదే విషయాన్ని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా తన వంతు ప్రయత్నాలు తాను చేస్తానని చెప్పేవారు.
అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా అన్నీ సీట్లలోనూ పోటీచేస్తానంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు అధికారం అప్పగించాలని జనాలను కోరుతున్నారు. అన్నీసీట్లలో నామినేషన్లు వేస్తామన్నారు. నామినేషన్లు వేయకుండా తమ అభ్యర్థులను ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళ కత చెబుతానని వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇంత సడెన్ గా పవన్లో వచ్చిన మార్పుకు తావీదు మహిమలాగ మోడీ మహిమనే చెప్పాలి. 25 నిమిషాల భేటీతో పవన్ ప్రాధాన్యతలన్నీ మారిపోయినట్లున్నాయి.
ఇక్కడ గమనించాల్సిందేమంటే అన్నీసీట్లలోనూ జనసేన నామినేషన్లు వేస్తుందంటే అర్థమేంటి..? టీడీపీతో పొత్తుండదనే కదా. అలాగే మిత్రపక్షమైన బీజేపీతో కూడా సంబంధాలు తెంపుకోవాలని అనుకుంటున్నారా..? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. బీజేపీతో పొత్తు కంటిన్యూ అయినా లేకపోతే కొత్తగా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నా అన్నీసీట్లలో జనసేన పోటీచేసే అవకాశం లేదుకదా..? పోనీ విజయనగరం జిల్లాలో చేసిన ప్రకటనకే పవన్ కట్టుబడుంటారా అంటే దాన్నీ నమ్మేందుకు లేదు.
రేపు ఇంకేమి చెబుతారో తెలీదు. తమ అధినేత పొత్తుల విషయంలో కావచ్చు, సమస్యలపై ఐక్య పోరాటాలు చేసే విషయంలో కావచ్చు, పోటీచేసే విషయంలోనూ కావచ్చు ఇన్ని రకాలుగా మాటలు మారుస్తుంటే నేతలకు పిచ్చెక్కిపోతోంది. రోజుకో అభిప్రాయం మార్చుకుంటున్న పవన్ను ఎలా నమ్మాలా అన్నదే ఇపుడు పార్టీ నేతలను పట్టిపీడిస్తున్న సమస్యగా మారింది. లోకల్ బీజేపీ నేతలతో సఖ్యత లేదుకాబట్టి వీళ్ళని పట్టించుకోడు. లోకల్ లీడర్లను పవన్ పట్టించుకోవటంలేదు కాబట్టి అగ్రనేతలు పవన్ను పట్టించుకోలేదు. రేపటి ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావటం ఖాయమని ఇంతకాలం చెప్పారు. తాజాగా తానొక ఫెయిల్యూర్ లీడరని ప్రకటించుకున్నారు. పరస్పర విరుద్ధమైన వైఖరితో పవన్ అందరిలోను పిచ్చెక్కించేస్తున్నది వాస్తవం.