ఓట్లు కొనొద్దని చెప్పట్లేదు.. జనసేనాని కొత్త పల్లవి
ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు 45 లక్షలకు ఖర్చు పెంచిందని పవన్ గుర్తుచేశారు. కనీసం భోజనాలు కూడా పెట్టకుండా రాజకీయాలు చేసేద్దాం అంటే కుదరదని చెప్పారు.
రాజకీయాల్లో తాను శుద్ధపూసనని చెప్పుకునే జనసేనాని పవన్ కళ్యాణ్ చిన్నగా మాట మార్చేస్తున్నారు. అబ్బబ్బే ఈ డబ్బులు, ప్రలోభాలు లేని రాజకీయాలు చేయడానికి తానొచ్చానని గప్పాలు కొట్టే కళ్యాణ్‌బాబు ఇప్పుడు మాట తిరగేస్తున్నారు. డబ్బుల్లేకుండా రాజకీయం చేయడం ఎక్కడ కుదరుతుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని తానెప్పుడూ చెప్పలేదన్న పవర్ స్టార్ అసలు అది సాధ్యమయ్యే పని కాదని కూడా తేల్చిచెప్పేశారు.
డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే..
ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు 45 లక్షలకు ఖర్చు పెంచిందని పవన్ గుర్తుచేశారు. కనీసం భోజనాలు కూడా పెట్టకుండా రాజకీయాలు చేసేద్దాం అంటే కుదరదని చెప్పారు. డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అని మా నాయకులకు చెప్పానన్నారు. ఓట్లు కొనాలా లేదా అన్నది నేను చెప్పనంటూనే.. ఆ విషయంలో మీరే నిర్ణయం తీసుకోండని జనసేన నాయకులకు హింట్ ఇచ్చేశారు. డబ్బులు లేని రాజకీయాలు ఓ పదేళ్ల తర్వాతయినా రావాలని, అప్పుడే నిజమైన అభివృద్ధి అని ముక్తాయింపుకూడా ఇచ్చారు.
ఇదేందబ్బా ఇది..
డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే.. ఓట్లు కొంటారా లేదా మీ ఇష్టం అనే వ్యాఖ్యల ద్వారా ఏం చేస్తారో తెలియదు నాకు సీట్లు కావాల్సిందే అని పవన్ జనసేన నేతలకు అన్యాపదేశంగా చెప్పినట్లయింది. ఈ లెక్కన ఆయన డబ్బుండి, ఖర్చు పెట్టగలిగినవారికే టికెట్లు ఇస్తానంటారేమో అని ఎంతోకాలంగా పార్టీని నమ్ముకుని తిరుగుతున్న ఆశావహుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఇప్పటికే టీడీపీ, బీజేపీ పొత్తులో మనకు సీట్లు వస్తాయో లేదోనని కంగారుపడుతుంటే ఇప్పుడు డబ్బులు అంటాడేంది నాయనా.. ఇంతకూ మనకు సీటొస్తుందా లేదా అని గాబరాపడుతున్నారు.