`కమలంతో కాపు`రం.. వరమా?.. భారమా?
వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నా, వ్యూహం మాత్రం వేరేదిగా కనిపిస్తోంది. ఏపీలో హిందూ మత అజెండా పెద్దగా పారే అవకాశం లేదు.
బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్ట్రాటజీతో వెళుతుంది. జాతీయస్థాయిలో హిందుత్వ అజెండా పక్కా. రాష్ట్రాలకి వచ్చేసరికి కుల, మత, ప్రాంతాలలో ఏ సమీకరణం తమకి కలిసి వస్తుందంటే దాని వైపు మొగ్గు చూపుతారు కమలనాథులు. దేశమంతా బీజేపీ ఎత్తుగడలు సాగుతున్నాయి. కొన్ని చోట్ల సింగిల్ గానే అధికారం దక్కించుకుంటున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో పొత్తుల వ్యూహంతో అధికార పీఠానికి దగ్గరవుతున్నారు. మెజారిటీకి దూరంగా ఆగిపోయిన రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, పార్టీలను చీల్చి మరీ అధికారం చేజిక్కించుకోగలుగుతున్నారు. ఇన్ని రకాలుగా అధికారం దక్కించుకుంటున్న కమలనాథులకు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అధికారం ఏం చేసినా సాధ్యమయ్యే పరిస్థితి లేదు.
ఏపీలో ఏదో ఒక పార్టీతో పొత్తు పొట్టుకుంటే డిపాజిట్లు దక్కే ఓట్లు, కొన్ని సీట్లు వస్తున్నాయి. సింగిల్‌గా ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా రావడంలేదు. ఒక వార్డుమెంబర్ కూడా సొంతంగా గెలవలేని ఏపీలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యమని కమలనాథులు ప్రకటించడం ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుంది.
వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నా, వ్యూహం మాత్రం వేరేదిగా కనిపిస్తోంది. ఏపీలో హిందూ మత అజెండా పెద్దగా పారే అవకాశం లేదు. విడిపోయిన చిన్న రాష్ట్రం కావడంతో ఇక్కడ ప్రాంతాల సెంటిమెంటూ పనిచేయదు. కుల రాజకీయాలతో వెళ్తామనుకుంటే వైసీపీ రెడ్లు, టిడిపి కమ్మలు, జనసేన కాపులు అధినేతలుగా ఉండటంతో ఆ పార్టీలపై ఆ కుల ముద్రలు పడిపోయాయి. రెడ్లను లాగలేరు, కమ్మలు గంపగుత్తగా బీజేపీ వైపు రారు. జనసేన కలిసొస్తే కాపుల కార్డుతో ఎన్నికలకి వెళ్లాలనేది బీజేపీ వ్యూహం అని తెలుస్తోంది.
జనసేన కూడా ఒంటరిగా పోటీ చేయడానికి మొగ్గు చూపితే.. కమలం కాపులతో ప్రయాణానికి సన్నద్ధం అవుతోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపిలో 22 శాతం ఉన్న కాపు ఓట్లు కొల్లగొట్టే ప్రణాళికలతో బీజేపీ పావులు కదుపుతోంది. కాపులలో బీసీలైన తూర్పు కాపులు జనాభా 25 లక్షలుంటుంది. వీరికి ఓబీసీ సమస్య ఉంది. దీని పరిష్కారం బాధ్యత తీసుకుంటామంటూ వారిని దువ్వుతున్నారు. ఓసీ కాపులైన తెలగ, బలిజ, ఒంటరి కులాల ఓట్ల కోసం వంగవీటి రంగా జపం మొదలు పెట్టింది బీజేపీ. రంగా పేరుతో ఓ జిల్లా ఏర్పాటు చేయాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందని అర్థం అవుతోంది. కాపుల రిజర్వేషన్ అంశం కూడా బీజేపీ టేకప్ చేసింది. అయితే కాపులకి ఇచ్చిన హామీలేవీ బీజేపీ నెరవేర్చలేదు. కాపులను మచ్చిక చేసుకోవడానికి డిమాండ్ల రూపంలో ఒక్కొక్కటిగా బయటకు తెస్తున్నారు. `కమలంతో కాపు`రం ఆ సామాజికవర్గానికి వరమా? శాపమా? అనేది మాత్రం రానున్న రోజుల్లో తెలుస్తుంది.