Telugu Global
Andhra Pradesh

అవసరమైతే చచ్చిపోతా.. కానీ, టీడీపీని నెగ్గనివ్వను - విడివాడ

సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన జనసేన పీఏసీ నేత నాదెండ్ల మనోహర్‌కు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది.

అవసరమైతే చచ్చిపోతా.. కానీ, టీడీపీని నెగ్గనివ్వను - విడివాడ
X

తెలుగుదేశం, జనసేనల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించడంతో.. చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి భగ్గుమంది. తణుకు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తణుకు అభ్యర్థిగా టీడీపీకి చెందిన అరిమిల్లి రాధాకృష్ణను ప్రకటించారు. దీంతో గత పదేళ్లుగా నియోజకవర్గంలో సేవలు చేస్తున్న జనసేన నేత విడివాడ రామచంద్రరావు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చిన జనసేన పీఏసీ నేత నాదెండ్ల మనోహర్‌కు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. తణుకు టికెట్‌ గతంలో పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చిన విధంగా విడివాడకు కేటాయించాలంటూ జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 28న నిర్వహించనున్న జనసేన, టీడీపీ ఉమ్మడి సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు నాదెండ్ల పెంటపాడుకు వచ్చేశారు. సమాచారం అందుకున్న విడివాడ పెద్ద ఎత్తున కార్యకర్తలతో అక్కడకు చేరుకున్నారు. నాదెండ్ల బస చేస్తున్న గెస్ట్‌ హౌస్‌ను జనసైనికులు ముట్టడించారు. అయితే విడివాడను కలిసేందుకు నాదెండ్ల ఇష్టపడలేదు. దీంతో జనసేన కార్యకర్తలు ఆందోళ‌న‌కు దిగారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలను చించేస్తూ జనసేన అధినేత పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు విడివాడ. తనకు పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌పై గౌరవం ఉందని.. విడివాడ అంటే రాష్ట్రమంతా తెలిసేలా పవన్‌ చేశారని చెప్పారు. కానీ, మధ్యలో ఏం జరిగిందో తనకు టికెట్ ప్రకటించలేకపోయారన్నారు. చావనైనా చస్తాను కానీ.. తణుకులో టీడీపీని నెగ్గనిచ్చేది లేదంటూ శపథం చేశారు.

First Published:  27 Feb 2024 11:21 AM IST
Next Story