ఏపీ రాజకీయాల్లో రౌడీసేన వ్యాఖ్యల రచ్చ..
సీఎం జగన్ లో అసహనం, ఆందోళన స్పష్టంగా కనపడ్డాయని అన్నారు నాదెండ్ల మనోహర్. జనసేనను చూసి ఆయన ఎంతలా భయపడుతున్నారో అర్థమవుతోందని చెప్పారు.
ఇటీవల కాలంలో ప్రతిపక్షాలను, వారికి అనుకూల వార్తలు ఇచ్చే పత్రికలను దుష్టచతుష్టయం అంటూ సీఎం జగన్ తీవ్రంగా విమర్శించేవారు. దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు అంటూ సెటైర్లు వేసేవారు. ఈరోజు జగన్ నరసాపురం పర్యటనలో మరోసారి టీడీపీ, జనసేనకు చాకిరేవు పెట్టారు. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అని, జనసేన అంటే రౌడీ సేన అని కొత్త అర్థాలు చెప్పారు. దీనిపై టీడీపీ కాస్త సైలెంట్ గా ఉన్నా, జనసేన మాత్రం వెంటనే కౌంటర్ ఇచ్చింది. రౌడీ సేన అంటూ జనసేన నాయకుల్ని, కార్యకర్తలను, వీర మహిళలను సీఎం జగన్ కించపరిచారని అన్నారు నాదెండ్ల మనోహర్. ఆయన వ్యాఖ్యల్ని ఖండించారు.
అసహనం, ఆందోళన..
సీఎం జగన్ లో అసహనం, ఆందోళన ఈరోజు స్పష్టంగా కనపడ్డాయని అన్నారు నాదెండ్ల మనోహర్. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న జనసేనను ఆయన రౌడీసేన అన్నారంటే, జనసేనను చూసి ఆయన ఎంతలా భయపడుతున్నారో అర్థమవుతోందని చెప్పారు. అసలు జనసేనను రౌడీసేన అనే అవసరం ఏమొచ్చిందో చెప్పాలన్నారు.
జనసేన ఎందుకు రౌడీ సేన? @ysjagan గారూ
— Manohar Nadendla (@mnadendla) November 21, 2022
మీరు రోడ్డునపడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా?
''మీరు రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకు జనసేన రౌడీసేన అవుతుందా..? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా..? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా..? మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా..? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని తెలిపినందుకా..? మీ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా..? రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా..?'' అని నాదెండ్ల ట్విట్టర్లో ప్రశ్నించారు. సోషల్ మీడియాలో జనసైనికులు కూడా సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో వైసీపీ నేతలు చేసిన ఘాటు విమర్శలను మరోసారి పోస్ట్ చేస్తూ తెలుగు బూతుల పార్టీ, రౌడీ సేన.. రెండూ వైసీపీయేనని కౌంటర్లు ఇస్తున్నారు.