ఎవరితో పొత్తు పెట్టుకున్నా అడక్కూడదట?
తాజా మీటింగులో కూడా తాను బీజేపీతోనే ఉంటానా లేకపోతే టీడీపీ పొత్తు పెట్టుకుంటానా అన్న విషయాన్ని చెప్పలేదు. ఎంతసేపు తాను ఎవరితో పొత్తు పెట్టుకున్నా అడగొద్దని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలదీయండి అని మాత్రమే చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో తాను ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఎవరూ అడగవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పేశారు. పార్టీ మీటింగులో పవన్ మాట్లాడుతూ.. ఎవరితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలనేది తాను చూసుకుంటానన్నారు. తాను ఎవరితో పొత్తు పెట్టుకున్నా రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తున్నాను అన్నది మాత్రమే ఆలోచించాలన్నారు. నరేంద్రమోడీని కలిసినప్పుడు కూడా వ్యక్తిగతంగా తనకేమీ కావాలని కాకుండా ప్రజల సమూహానికి ఏమి కావాలని మాత్రమే అడుగుతానని చెప్పారు.
అధికారంలోకి రాగానే ఎస్సీలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తానని ప్రకటించారు. దళిత ఆడపడుచుని హోంమంత్రిని చేసినా కనీసం కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేయించుకోలేని స్థితిలో ఉంచేశారని మండిపోయారు. జనసేన అధికారంలోకి వస్తే ఈ పరిస్ధితి పూర్తిగా మారిపోతుందన్నారు. సీఎంగా తాను తప్పుచేసినా సరే తనను సైతం నిలదీసేంత అధికారాలను మంత్రులకు ఇస్తానని చెప్పారు. అంటే పవన్ మాటలను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చేయబోతున్నట్లుగానే ఉంది.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సఖ్యతగా ఉండక తప్పదన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ను చూసి తాను ఈ విషయం నేర్చుకున్నట్లు చెప్పారు. ఎంజీఆర్ చనిపోయింది 1987లో.. అప్పటికి పవన్ వయసు ఎంతుందో మరి. అంత చిన్న వయసులోనే ఎంజీఆర్‌ను చూసి పవన్ ఏం నేర్చుకున్నారో మరి ఆయనే చెప్పాలి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే 2014 ఎన్నికల్లో ప్రచారం చేసేటపుడు చంద్రబాబునాయుడు హామీలను తాను పూచీగా ఉంటానని హామీఇచ్చారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తన చొక్కా పట్టుకోమని, తాను కూడా ప్రజలపక్షాన నిలదీస్తానని పదేపదే చెప్పారు. మరి చంద్రబాబును ఎన్నిసార్లు పవన్ నిలదీశారో ఎవరికీ తెలీదు. తాజా మీటింగులో కూడా తాను బీజేపీతోనే ఉంటానా లేకపోతే టీడీపీ పొత్తు పెట్టుకుంటానా అన్న విషయాన్ని చెప్పలేదు. ఎంతసేపు తాను ఎవరితో పొత్తు పెట్టుకున్నా అడగొద్దని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలదీయండి అని మాత్రమే చెప్పారు.