రౌడీలు రాజ్యాలు ఏలకూడదు.. పవన్ పంచ్ డైలాగ్
ఇటీవల బెయిల్ పై విడుదలైన జనసేన నేతల్ని పార్టీ ఆఫీస్ లో శాలువాలు కప్పి సన్మానం చేశారు పవన్ కల్యాణ్. వారి కుటుంబ సభ్యులతో సమావేశమై జనసేన అండగా ఉంటుందని చెప్పారు.
ఇటీవల ప్రెస్ మీట్లో చెప్పు చూపిస్తూ మాట్లాడి ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన పవన్ కల్యాణ్, కొన్ని రోజుల గ్యాప్ తర్వాత పొలిటికల్ పంచ్ డైలాగులతో మరింత సెగలు రేపుతున్నారు. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవని, రౌడీలు రాజ్యాలు ఏలకూడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ నిర్బంధాలకు జనసేన వెరవదు అని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తాయనే భయంతోనే విశాఖలో జనవాణి కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నారని విమర్శించారు. రాజమండ్రి పీఏసీ మీటింగ్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన పవన్ కల్యాణ్, మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విశాఖ నేతలతో సమావేశవయ్యారు. ఏపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కు పెట్టారు.
ఇదెక్కడి సంప్రదాయం..?
ఇటీవల బెయిల్ పై విడుదలైన జనసేన నేతల్ని పార్టీ ఆఫీస్ లో శాలువాలు కప్పి సన్మానం చేశారు పవన్ కల్యాణ్. వారి కుటుంబ సభ్యులతో సమావేశమై జనసేన అండగా ఉంటుందని చెప్పారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో తప్పెవరిది అనేది ఇంకా నిర్థారణ కాలేదు కానీ, మంత్రుల కాన్వాయ్ పై దాడిని ఎవరూ సమర్థించరు. పవన్ మాత్రం నిందితులుగా ఉన్నవారికి సన్మాన కార్యక్రమాలు పెట్టడం మాత్రం విశేషం. ఆమధ్య చంద్రబాబు కూడా "తిరగబడండి తమ్ముళ్లూ మీకు నేనున్నా, కేసులు పెట్టుకుంటే పార్టీ చూసుకుంటుంది" అంటూ భరోసా ఇస్తూ సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్ లు పెట్టించేవారు. నాయకులు రెచ్చగొడతారు, శాలువాలు కప్పుతారు సరే, చివరకు కటకటాల వెనక ఉండాల్సింది, జైలుపక్షి అని ముద్ర వేయించుకోవాల్సింది మాత్రం అమాయకపు కార్యకర్తలే అనేది వాస్తవం.
అందరి దృష్టి రాజమండ్రి సభపైనే..
ఈరోజు రాజమండ్రిలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరగాల్సి ఉంది. రేపు రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల మీటింగ్ ఉంది. ఈ రెండు సమావేశాల్లో ఏం జరుగుతుందో, ఎలాంటి సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉంటాయోననే అనుమానం అందరిలో ఉంది. శాంపిల్ గా మంగళగిరిలో.. రౌడీ రాజ్యం, రాజకీయాల్లో రౌడీలు అంటూ ఘాటైన విమర్శలు చేశారు పవన్. వీటికి కొనసాగింపుగా రాజమండ్రి మీటింగ్ ఉంటుంది. మొత్తమ్మీద ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఏపీలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కాస్త వెనకబడినా, జనసేన మాత్రం దూకుడుగా ఉంది.