Telugu Global
Andhra Pradesh

అడక్కపోయినా మూడు పెళ్లిళ్లపై పవన్ వ్యాఖ్యలు

విశాఖలో యాక్టింగ్ నేర్చుకుంటే విశాఖలో.. ముంబైలో యాక్టింగ్ నేర్చుకుంటే ముంబైలో రాజధాని పెట్టాలా అని ప్రశ్నించారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని.. అలాగ‌ని మూడు రాజధానులు పెట్టాలా.. పిచ్చిపిచ్చి లాజిక్‌లు మాట్లాడవద్దు అంటూ విలేకర్లపై ఫైర్ అయ్యారు.

అడక్కపోయినా మూడు పెళ్లిళ్లపై పవన్ వ్యాఖ్యలు
X

విశాఖపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్‌పోర్టు వద్ద మంత్రులపై దాడి, రాత్రి జనసేన నాయకులు అరెస్ట్ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వెనక్కు తగ్గారు. జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. పోలీసులపై ఫైర్ అయ్యారు. తాము ఎలా ర్యాలీ చేయాలో వైసీపీ వారే చెబుతారా.. అని ప్రశ్నించారు. నిన్న ర్యాలీ సమయంలోనూ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కారులో ఎక్కారని.. తనను పదే పదే అవమానించారని పవన్ కల్యాణ్ చెప్పారు. తాను అభివాదం చేస్తుంటే ముందు కూర్చో అంటూ మాట్లాడారని.. చాలా చులకనగా తనను పోలీసు అధికారి చూశారని.. గొడవ పెట్టుకుని ధైర్యం లేక కాదు.. ప్రజాస్వామ్యంపై నమ్మకంతోనే తాను మౌనంగా ఉండిపోయానని పవన్ కల్యాణ్ చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి తమ పార్టీ వ్యతిరేకమని చెప్పిన పవన్ కల్యాణ్.. మంత్రులపై జరిగిన దాడిని మాత్రం ఖండించలేదు. ఏమో కోడి కత్తి ఘటన తరహాలో వారే దాడి చేయించుకున్నారేమో అంటూ మాట్లాడారు. ఆ కోణం కూడా చూడాలంటూ మాట్లాడారు. పరోక్షంగా జనసేన కార్యకర్తల దాడులను వెనుకేసుకొచ్చారు.

విశాఖ పట్నం మీకు యాక్టింగ్ నేర్చుకునే అవకాశం ఇచ్చింది,.. మీరు పోటీ చేసేందుకు కూడా ఈ ప్రాంతమే అవకాశం ఇచ్చింది అలాంటి చోట రాజధాని వస్తుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించగా.. పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. పిచ్చిపిచ్చి లాజిక్కులు మాట్లాడవద్దని ఫైర్ అయ్యారు. విశాఖలో యాక్టింగ్ నేర్చుకుంటే విశాఖలో.. ముంబైలో యాక్టింగ్ నేర్చుకుంటే ముంబైలో రాజధాని పెట్టాలా అని ప్రశ్నించారు.

తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని.. అలాగ‌ని మూడు రాజధానులు పెట్టాలా.. పిచ్చిపిచ్చి లాజిక్‌లు మాట్లాడవద్దు అంటూ విలేకర్లపై ఫైర్ అయ్యారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కొందరికి అసూయగా ఉన్నట్టుగా ఉందని.. కావాలంటే వారు కూడా వారి భార్యలకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు పవన్ కల్యాణ్‌. రాత్రి వంద మందిని పోలీసులు తీసుకెళ్లారని ఆరోపించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హంతకులను మాత్రం పట్టుకోలేని వ్యక్తి.. తాను కారులో నుంచి అభివాదం చేస్తున్నా తట్టుకోలేకపోతున్నారని పవన్ ఫైర్ అయ్యారు. దశాబ్దాల పాటు రాజకీయాలు చేయడానికే తాను వచ్చానని.. వైసీపీ రౌడీలను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు. రెచ్చగొట్టాలంటే తన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయని.. కానీ ప్రజాస్వామ్యంపై నమ్మకంతోనే వాటిని వాడటం లేదన్నారు.

First Published:  16 Oct 2022 12:39 PM IST
Next Story