రెచ్చగొట్టడమే పవన్ ప్లానా?
సరిగ్గా బహిరంగ సభ జరిగే రోజే అది కూడా వైజాగ్‌లోనే పవన్ పార్టీ సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? జనవాణి పేరుతో పెట్టుకుంటున్న కార్యక్రమాలు కూడా హఠాత్తుగా నిర్ణయించిందే అని అర్ధమవుతోంది.
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టూర్ ప్రోగ్రామ్ చూస్తుంటే రెచ్చగొట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా అధికార పార్టీ మద్దతుతో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఆ బహిరంగ సభ కూడా 15వ తేదీనే విశాఖలో జరగబోతోంది. ఈ విషయాన్ని జేఏసీ నేతలు దాదాపు వారం రోజుల క్రితమే ప్రకటించారు.
బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు ఎక్కడికక్కడ ర్యాలీలు, రోడ్డు షోలు, చిన్నపాటి సమావేశాలు జరుగుతున్నాయి. సరిగ్గా బహిరంగ సభ జరిగే రోజే అది కూడా వైజాగ్‌లోనే పవన్ పార్టీ సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? జనవాణి పేరుతో పెట్టుకుంటున్న కార్యక్రమాలు కూడా హఠాత్తుగా నిర్ణయించిందే అని అర్ధమవుతోంది. గతంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమాలను పార్టీ బాధ్యులు ముందే ప్రకటించారు. కానీ విశాఖలో మీటింగు మాత్రం అప్పటికప్పుడు నిర్ణయించిందే.
సోమవారం ఉదయం 'ఎందుకీ గర్జన' అంటు ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ఉద్దేశించి పవన్ చాలా ప్రశ్నలను సంధించారు. వాటికి కొందరు మంత్రులు ధీటుగానే రిప్లై ఇచ్చారు. ఒకవైపు ఈ రగడ నడుస్తుండగానే సాయంత్రం 15, 16, 17 తేదీల్లో పవన్ ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకున్నట్లు పార్టీ ప్రకటించింది. అంటే ప్రజాగర్జనకు పోటీగా పవన్ తన కార్యక్రమాలను పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. ఇది కచ్చితంగా జేఏసీని రెచ్చగొట్టడం కాక మరేమిటి ?
అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని ఒకవైపు డిమాండ్ చేస్తున్న పవన్ మరోవైపు మూడు రాజధానులకు మద్దతుగా బహిరంగ సభ జరుగుతున్న వైజాగ్‌లో ప్రోగ్రామ్ పెట్టుకున్నారంటే అర్ధమేంటి? తన కార్యక్రమాన్ని మరో మూడు రోజులు వాయిదా వేసుకున్నా నష్టం లేదుకదా. కానీ సరిగ్గా అదే రోజు పెట్టుకున్నారంటేనే పవన్ పంతానికి పోతున్నట్లు తెలిసిపోతోంది. ఈ కారణంగానే పవన్ వైజాగ్ చేరుకోగానే గొడవలు జరిగే అవకాశముంది. మరి ఈ విషయమై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.