Telugu Global
Andhra Pradesh

ఏపీ రోడ్లపై జనసేనాని పవన్ క‌ల్యాణ్‌ డిజిటల్ 'యుద్ధం' !

డిజిటల్ ప్రచారంలో భాగంగా జనసేన.. ఏపీ రోడ్లకు సంబంధించి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించనుంది

ఏపీ రోడ్లపై జనసేనాని పవన్ క‌ల్యాణ్‌ డిజిటల్ యుద్ధం !
X

ఏపీలో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల దుస్థితిపై జనసేన అధినేత పవన్ క‌ల్యాణ్‌ దృష్టి పెట్టారు. 'గుడ్ మార్నింగ్ సీఎం సర్' పేరిట ఈ సమస్యపై డిజిటల్ ప్రచారాన్ని చేపట్టారు. నీటి గుంతలతో రోడ్లు స్విమ్మింగ్ పూల్స్ ని తలపిస్తున్నాయని, అత్యంత దయనీయ స్థితిలో ఉన్న రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ రోడ్లపై ప్రయాణించాలంటేనే ఎవరైనా జంకుతారని, ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. అభివృద్ధి.. అభివృద్ధి అంటున్నారు గానీ.. అది మచ్చుకైనా కనిపించదు.. ఆషామాషీగా మరమ్మతులు చేపట్టి రోడ్లను వదిలేస్తున్నారు.. వీటి దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు ఈ నెల 15 నుంచి 17 వరకు.. మూడు రోజులపాటు డిజిటల్ ప్రచార యుద్ధాన్ని ప్రారంభిస్తున్నాం.. 'గుడ్ మార్నింగ్ సర్' అనే హ్యాష్ టాగ్ తో ఇది మొదలవుతుంది. పాడైన రోడ్లకు మరమ్మతులు చేయించాలని ప్రతిపక్షాలు మొర పెట్టుకున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు.. రోడ్లు, భవనాల శాఖ పరిధి కింద రాష్ట్రంలో 14,722 కి.మీ.మేర జాతీయ రహదారులున్నాయి.. ప్రధాన జిల్లా రోడ్లు 32,240 కి.మీ.మేర ఉన్నాయి.. అలాగే రాష్ట్రంలో 6,100 కి.మీ. మేర ఇతర రోడ్లు ఉన్న విషయం తెలిసిందే.. 9,222 కిలో మీటర్ల పంచాయతీ రోడ్ల మరమ్మతులకు రూ. 1,072 కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం గత ఏప్రిల్‌ లోనే ప్రకటించింది కూడా అని పవన్ క‌ల్యాణ్‌పేర్కొన్నారు.

రోడ్ల రిపేర్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నా పరిస్థితి క్షేత్ర స్థాయిలో చాలా అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. రోడ్లపై పందులు తిరుగుతున్నాయని, వాటిని డిస్టర్బ్ చేయడమెందుకని వైసీపీ నేతలు రోడ్ల జోలికి వెళ్లడం లేదని ఆయన సెటైరిక్ గా దుయ్యబట్టారు. ఏడాదికి 8 వేల కి.మీ. మేర సర్కార్ రోడ్ల మెయింటెన్సెన్స్, రిపేర్లకు సుమారు రూ.15 వందల కోట్లను ఖర్చు చేయాల్సి ఉందని, కానీ ఇందుకు మరో రూ.500 కోట్లు అవసరమవుతాయని ఆయన అన్నారు. ప్రణాళికేతర బడ్జెట్ లో ఈ లెక్క చూపారని, కానీ దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదన్నారు.

ఇక తమ డిజిటల్ ప్రచారంలో భాగంగా జనసేన.. ఏపీ రోడ్లకు సంబంధించి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించనుంది. జనసేన కార్యకర్తలు వీటిని తమ తమ ఏరియాల్లో కూడా ప్రదర్శించాలని, ప్రతి కార్యకర్త తమ ప్రాంతాల్లోని రోడ్ల స్థితిగతులకు సంబంధించి డేటా సేకరించాలని పవన్ క‌ల్యాణ్‌ సూచించారు. ఏపీలో గత మూడేళ్ళుగా రోడ్ల మరమ్మతులు జరగలేదని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని అన్నారు. కాగా కొన్ని నెలల క్రితం ఆయన రాజమహేంద్రవరం టూర్ సందర్భంగా రోడ్లపై కొన్ని పాట్ హోల్స్ ని స్వయంగా పూడ్చి వేసిన విషయం గమనార్హం. అనంతరం జనసేన నేతలు సుమారు నెలరోజులపాటు ఇలాంటి కార్యక్రమాలను చేబట్టారు. ఇక టీడీపీ కూడా రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ఫోకస్ పెట్టింది. పాడైన రోడ్ల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని తమ పార్టీ కార్యకర్తలను నాయకత్వం ఆదేశించింది. జనసేన మాదిరే దీనికి కూడా ముఖ్యమంత్రి అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించాలని సూచించింది.

అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిండిపోయి ఊళ్లకు ఊళ్లు, గ్రామాలకు గ్రామాలే ముంపు పరిస్థితిని ఎదుర్కొంటుండగా రోడ్లు మరింతగా తెగిపోతున్నాయి. భారీ వృక్షాలు నేలకొరిగి రోడ్లకు అడ్డంగా కూలిపోతున్నాయి. ప్రజల రాకపోకలు స్తంభించిపోతున్న ఈ తరుణంలో రోడ్ల బాగు అన్న కార్యక్రమం ఎలా చేపడ్తారన్నది మిస్టరీయే !

First Published:  15 July 2022 1:07 PM IST
Next Story