పవన్ కల్యాణ్.. అప్పుడలా.. ఇప్పుడిలా.. ఎందుకిలా? - విస్తుపోతున్న జనసేన క్యాడర్
టీడీపీ నేతల కంటే ఎక్కువగా పవన్ స్పందించడం చూసి జనసేన క్యాడర్ విస్తుపోతున్నారు. తాము టీడీపీ కోసం.. చంద్రబాబు కోసం పనిచేస్తున్నామా.. లేక జనసేన కోసం పనిచేస్తున్నామా అనేది అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు.
చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టయి.. రిమాండ్‌పై జైలుకెళితే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించడం, టీడీపీ బంద్ పిలుపునకు కూడా మద్దతివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అరెస్టయిన చంద్రబాబును విజయవాడలో స్వయంగా కలిసి మద్దతు ప్రకటించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకోవడం.. దానికి అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డు మార్గంలో అప్పటికప్పుడు విజయవాడకు బయలుదేరడం.. శాంతిభద్రతల నేపథ్యంలో పోలీసులు అడ్డుకుంటే.. రోడ్డుపైనే పడుకుని నిరసన తెలియజేయడం చూసి సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు.
టీడీపీ నేతల కంటే ఎక్కువగా పవన్ స్పందించడం చూసి జనసేన క్యాడర్ విస్తుపోతున్నారు. తాము టీడీపీ కోసం.. చంద్రబాబు కోసం పనిచేస్తున్నామా.. లేక జనసేన కోసం పనిచేస్తున్నామా అనేది అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. చంద్రబాబు అరెస్టు అనగానే పవన్ ఎన్నడూ లేనంత హడావుడి చేయడం చూసి విస్తుపోతున్నారు. జనసేన నేతల విషయాల్లో పవన్ ఎప్పుడూ ఇంతలా స్పందించిన సందర్భాలు లేవని చెబుతున్నారు. ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
పవన్ నాయకత్వంలో జనసేన పార్టీ తరఫున తమ భవిష్యత్తును ఊహించుకుంటున్న జనసైనికులు.. ఇప్పుడు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని భావిస్తున్నారు. పవన్ తీరు పార్టీ ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు. చంద్రబాబు ప్రయోజనాలా, జనసేన పార్టీనా అంటే.. తమ అధినేత పవన్ కార్యక్రమాలన్నీ చంద్రబాబు కోసమే అన్నట్లు కొనసాగుతున్నాయని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో ఆయన పైనా, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పైనా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. ఇప్పుడు చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసి, కోర్టు రిమాండ్ విధిస్తే.. ఇదే పవన్ ఆ అరెస్టును ఖండించడంతో పాటు చంద్రబాబుకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించడంపై జనసేన నేతలు, కార్యకర్తలు విస్తుపోతున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబుపై పవన్ విమర్శలన్నీ కేవలం అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి టీడీపీని మళ్లీ గెలిపించేందుకేనని, ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతోందని జనసైనికులే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఓటుకు కోట్లు కేసు సమయంలోనూ చంద్రబాబు ప్రమేయం స్పష్టంగా బయటపడినా, ఆ ఘటనపై మూడేళ్ల పాటు పవన్ మౌనంగా ఉండటం వల్లే.. వారిద్దరూ ఒక్కటే అన్న భావనతో పవన్ ను ప్రజలు రెండు చోట్లా ఓడించారని విశ్లేషిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే.. పవన్‌పై చేస్తున్న ప్యాకేజీ స్టార్ అనే ఆరోపణ నిజమేననే సందేహాలు జనసేన క్యాడర్‌లో వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ ద్వారా తమ రాజకీయ భవిష్యత్తు, ఎదుగుదలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నవారు అవన్నీ అడియాసలవుతున్నాయని ఆందోళనకు గురవుతున్నారు.