Telugu Global
Andhra Pradesh

పేదల ఇళ్లకు పక్కా హక్కు.. - రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన జగన్‌ ప్రభుత్వం

’నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన 30.61 లక్షల ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయడంతో పాటు కన్వేయన్స్‌ డీడ్స్‌ కూడా ఇవ్వాలని నిర్ణయించిన జగన్‌ ప్రభుత్వం.

పేదల ఇళ్లకు పక్కా హక్కు.. - రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన జగన్‌ ప్రభుత్వం
X

పేదలకు సొంతింటి కలను సాకారం చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వాటిపై పూర్తిహక్కు కల్పించేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. బుధవారమే ఈ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం తొలిరోజే 10 వేల డాక్యుమెంట్లు జారీ చేసింది. రెండోరోజు నుంచి ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసి 15 రోజుల వ్యవధిలో మొత్తం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని టార్గెట్‌గా పెట్టుకొంది. రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుపెట్టిన ప్రభుత్వం.. అందుకు అయ్యే రిజిస్ట్రేషన్‌ వ్యయాన్ని కూడా భరిస్తోంది. తద్వారా పేదలకు రిజిస్ట్రేషన్ల వ్యయం విషయంలోనూ ఉపశమనం కల్పిస్తోంది.

’నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసిన 30.61 లక్షల ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయడంతో పాటు కన్వేయన్స్‌ డీడ్స్‌ కూడా ఇవ్వాలని నిర్ణయించిన జగన్‌ ప్రభుత్వం.. రిజిస్ట్రేషన్‌ చేసిన డాక్యుమెంట్లో ఆ స్థలానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విలువ, భూసేకరణ ద్వారా ఆ భూమిని సేకరిస్తే ఉన్న విలువను కూడా ముద్రిస్తోంది. రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చిన ఆస్తిపై 10 సంవత్సరాల తర్వాత సంపూర్ణ శాశ్వత హక్కులు లభిస్తాయని దస్తావేజుల్లో పేర్కొంటోంది. ఇందుకోసం ఏ ప్రభుత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) పొందాల్సిన అవసరం ఉండదని స్పష్టంగా పేర్కొంది. స్థలానికి సంబంధించి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను వారి పేరు మీద చెల్లించుకోవచ్చని డాక్యుమెంట్‌లో తెలిపింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసిన ఆస్తిపై భవిష్యత్లో ఎటువంటి వివాదాలు, తగాదాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది.

ఈ రిజిస్ట్రేషన్ల కోసం చెల్లించాల్సిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఛార్జీ, యూజర్‌ ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తోంది. అప్పాయమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసిన రూ.11.61 లక్షల విలువైన ఆస్తికి సాధారణంగా అయితే ఆమె రూ.18,600 స్టాంప్‌ డ్యూటీ, రూ.2,325 రిజిస్ట్రేషన్‌ ఛార్జీ, రూ. 500 యూజర్‌ ఛార్జీ కలిపి మొత్తం రూ.21,425 చెల్లించాల్సి ఉంటుంది. దానిని ప్రభుత్వమే భరించింది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలో మొట్టమొదటగా తాతపూడి అప్పాయమ్మ పేరు మీద సచివాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్‌ చేశారు. ప్రస్తుతం ఆ స్థలం ప్రభుత్వ విలువ రూ.4.46 లక్షలు కాగా, భూసేకరణ విలువ రూ.11.61 లక్షలుగా అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి మూడో వారంలో ఈ కన్వేయన్స్‌ డీడ్‌ల పంపిణీని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత నియోజకవర్గాలు, సచివాలయాల స్థాయిలో ప్రజాప్రతినిధులు ఈ డీడ్‌లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

First Published:  1 Feb 2024 8:59 AM IST
Next Story