Telugu Global
Andhra Pradesh

ఫైనల్ గా జగనన్నకే చెబుదాం..

జగనన్నకు చెబుదాం అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని అన్నారు సీఎం జగన్. స్పందనకు మరింత మెరుగైన రూపమే ఇదని చెప్పారు.

ఫైనల్ గా జగనన్నకే చెబుదాం..
X

ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల సమర శంఖం పూరించింది. అటు నాయకుల్ని, ఇటు ప్రజల్ని ఏమాత్రం ఖాళీగా ఉంచడంలేదు సీఎం జగన్. ఏదో ఒక కార్యక్రమం పేరుతో రెండు వర్గాల్నీ బిజీగా ఉంచుతున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జోరుగా సాగుతోంది. దీనికి తోడు మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. ప్రతి కుటుంబం వద్ద ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు వైసీపీ నేతలు. మెగా పీపుల్ సర్వే పేరుతో పార్టీయే నేరుగా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇదే కోవలో జగనన్నకు చెబుదాం అంటూ మే-9నుంచి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం.

పాతదే కానీ..

ఇప్పటి వరకూ జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా అధికారులు అర్జీలు స్వీకరిస్తారు. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారు. అధికారులకు చెప్పినా పరిష్కారం కాని సమస్యలను నేరుగా ముఖ్యమంత్రికి చేరవేయడమే జగనన్నకు చెబుదాం. దీనికోసం 1902 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేపట్టి, ఫైనల్ గా మే-9నుంచి అమలులో పెట్టబోతున్నారు.

జగనన్నకు చెబుదాం అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని అన్నారు సీఎం జగన్. స్పందనకు మరింత మెరుగైన రూపమే ఇదని చెప్పారు. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే దీని లక్ష్యం అని అధికారులకు వివరించారు. ఇండివిడ్యువల్‌ గ్రీవెన్సెస్‌ ని అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశం అన్నారు. హెల్ప్‌ లైన్‌ కు కాల్‌ చేసి గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ చేస్తే.. వాటిల్ని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలన్నారు. క్యాంప్ కార్యాలయంలో చేపట్టిన సమీక్షలో ఈ వివరాలు తెలియజేశారు.

సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి, ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేసే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేశారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది. హెల్ప్‌ లైన్‌ ద్వారా సమస్యలను తెలుసుకుంటారు. వాటిని నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి. గ్రీవెన్స్‌ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అనేది ఇందులో చాలా ముఖ్యం. ఐవీఆర్ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌ లైన్‌ గురించి అవగాహన కల్పిస్తారు. ఈ హెల్ప్‌ లైన్‌ ను వినియోగించుకునేలా ప్రజల్ని ప్రోత్సహిస్తారు. ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహిస్తారు.

First Published:  28 April 2023 5:46 PM IST
Next Story