Telugu Global
Andhra Pradesh

1902 గేమ్ ఛేంజర్ అవుతుందా?

వ్యవస్థ‌ను పక్కాగా ఏర్పాటు చేశారు కాబట్టి పరిష్కారం కూడా అంతే పక్కాగా జరిగితే 1902నే రాబోయే ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని అనుకుంటున్నారు.

1902 గేమ్ ఛేంజర్ అవుతుందా?
X

జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమస్యల పరిష్కారం కోసం అవస్థ‌లు పడుతున్న జనాలు 1902కి ఫోన్ చేసి తమ సమస్యను చెప్పుకుంటే వెంటనే పరిష్కారం అవ్వాలని. ఈ కార్యక్రమానికే ‘జగనన్నకు చెబుదాం’ అని పేరు పెట్టారు. కార్యక్రమం ప్రారంభించటం కాదు దాని వల్ల జనాలకు ఎంతవరకు ఉపయోగం జరుగుతోంది? సమస్యలు పరిష్కారం అవుతోందా లేదా అన్నదే కీలకం.

మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రారంభించిన కార్యక్రమానికి సాయంత్రం 6 గంటలకు సుమారు వెయ్యి ఫోన్లు వచ్చినట్లు సమాచారం. అంటే సగటున గంటకు 250 కాల్స్ వచ్చాయి. ఇందులో ఎక్కువగా రెవెన్యూ, పోలీసు శాఖలకు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయట. అలాగే ఫించన్లు అందటం లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయట. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఫిర్యాదులకు అధికారులు ఎంత వేగంగా స్పందిస్తున్నారు? సమస్యలు ఎంత స్పీడుగా పరిష్కారం అవుతున్నాయన్నదే కీలకం.

జగనన్నకు చెప్పుకున్నా సమస్య పరిష్కారం కాలేదని జనాల్లో భావన మొదలైతే అది ప్రభుత్వానికి, పార్టీకి కూడా చాలా నెగిటివ్ అయిపోతుంది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అదే చెప్పుకున్న సమస్యలకు పరిష్కారం కనిపిస్తోందని అనుకుంటే జగన్ ఇమేజ్‌ పెరుగుతుంది. అందుకనే ఈ కార్యక్రమాన్ని జగన్ గేమ్ ఛేంజర్ అని అనుకుంటున్నట్లు సమాచారం.

అందుకనే ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేయటం కోసం పెద్ద వ్యవస్థ‌నే ఏర్పాటు చేశారు. ఫోన్ చేసి ఫిర్యాదు చెప్పగానే వెంటనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ట్రాన్స్ ఫర్ అయిపోతుంది. శాఖల కార్యదర్శులకు అక్కడి నుండి డిపార్టమెంట్లో సంబంధిత సెక్షన్‌కు, అక్కడి నుండి జిల్లాల కలెక్టర్లు లేదా ఎస్పీలు లేదా మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలకు ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఫిర్యాదుదారుడు ఏ ప్రాంతానికి చెందినవారో చూసుకుని సంబంధిత మండల లేదా గ్రామ సచివాలయాలకు కాల్స్ బదిలీ అయిపోతున్నాయి.

చివరకు తమ ఫిర్యాదుపై స్పందించబోయే అధికారి ఎవరు? ఎన్నిరోజుల్లో పరిష్కారమవుతుందనే విషయం ఫిర్యాదుదారుడికి మొబైల్లోనే ఎక్నాలెడ్జిమెంట్ రూపంలో అందుతోంది. ఈ విషయాలన్నింటినీ సీఎం డ్యాష్ బోర్డులో కూడా ఉంచుతున్నారు. వ్యవస్థ‌ను పక్కాగా ఏర్పాటు చేశారు కాబట్టి పరిష్కారం కూడా అంతే పక్కాగా జరిగితే 1902నే రాబోయే ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని అనుకుంటున్నారు.

First Published:  10 May 2023 11:39 AM IST
Next Story