Telugu Global
Andhra Pradesh

ఆ పథకంలో జగన్ పేరు లేదు.. టీడీపీ కడుపుమంట చల్లారినట్టేనా..?

ప్రతి ఏడాది దాదాపు 40లక్షల కిట్లు ప్రభుత్వం తరపున పంపిణీ చేస్తారు. ఈసారి ఎన్నికల కోడ్ ఉండటంతో ఇప్పటి వరకూ కిట్లు స్కూల్స్ కి చేరలేదు.

ఆ పథకంలో జగన్ పేరు లేదు.. టీడీపీ కడుపుమంట చల్లారినట్టేనా..?
X

రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరు ముందు చేర్చడం ఎప్పట్నుంచో ఉన్న ఆనవాయితీ. ఆ మాటకొస్తే చంద్రన్న బీమా, చంద్రన్న సంక్రాంతి కానుక.. వంటి పథకాలు టీడీపీ హయాంలో ఉన్నాయి. కానీ కొత్తగా జగనే ఈ ఆనవాయితీ ప్రారంభించినట్టు టీడీపీ నేతలు కడుపుమంటతో విమర్శలు చేస్తుంటారు. ఇదే విషయంపై ఎల్లో మీడియా కూడా విషం చిమ్ముతుంటుంది. తాజాగా వారి కడుపుమంట చల్లారే న్యూస్ చెప్పింది ఎన్నికల కమిషన్. జగనన్న విద్యా కానుక ఈ ఏడాది జగన్ ఫొటోలు లేకుండానే పంపిణీ చేసేలా ఉత్తర్వులిచ్చింది.

జగనన్న విద్యాకానుక పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలతోపాటు బ్యాగ్, షూస్, బెల్ట్, టై, యూనిఫామ్ ఇస్తున్నారు. ఆ బ్యాగ్ పై జగన్ ఫొటో ఉంటుంది. ఆ ఫొటో ఎందుకంటూ చాన్నాళ్లుగా టీడీపీ రచ్చ చేస్తోంది. ఇన్నాళ్లకు వారి పంతం నెగ్గింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. స్కూల్ బ్యాగ్ పై జగన్ ఫొటోలు లేకుండానే మెటీరియల్ పంపిణీకి రెడీ అయింది. ఈసీ ఉత్తర్వులతో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రతి ఏడాది దాదాపు 40లక్షల కిట్లు ఇలా ప్రభుత్వం తరపున పంపిణీ చేస్తారు. ఈసారి ఎన్నికల కోడ్ ఉండటంతో ఇప్పటి వరకూ కిట్లు స్కూల్స్ కి చేరలేదు. ఎన్నికలు పూర్తి కావడంతో విద్యాశాఖ ఈసీ అనుమతి కోరింది. పథకం ముందు ఉన్న జగనన్న అనే పేరు తీసేయడంతోపాటు, మెటీరియల్ పై కూడా జగన్ ఫొటోలు తీసివేసి పంపిణీ పూర్తి చేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. దీంతో జగన్ ఫొటో లేకుండా కిట్లు తయారయ్యాయి. వచ్చేవారం నుంచి స్కూల్‌ కాంప్లెక్స్‌లు, పాఠశాలలకు విద్యా కానుక కిట్లు సరఫరా అవుతాయి.

First Published:  20 May 2024 12:16 PM IST
Next Story