అధికారులే ఇంటికొస్తారు.. ఇది జగనన్న సురక్ష
జగనన్న సురక్షలో భాగంగా ఎవరినైనా సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తిస్తే వారికి ఆగస్టు 1నుంచి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమం కోసం 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.
సమస్యలున్నా, సర్టిఫికెట్లు కావాలన్నా ప్రజలు.. ఆఫీస్ ల చుట్టూ తిరగడం పరిపాటి. కానీ దీన్ని పూర్తిగా మార్చేస్తామంటున్నారు సీఎం జగన్. అధికారులే ప్రజల వద్దకు వెళ్లేలా జగనన్న సురక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీ ఇంట్లో ఏమైనా సమస్యలున్నాయా..? మీకు ప్రభుత్వ పథకాలు అందడంలేదా..? సర్టిఫికెట్ల మంజూరులో జాప్యం జరుగుతోందా..? పట్టాదారు పాస్ పుస్తకాలకు చేసుకున్న దరఖాస్తుల్లో సమస్యలున్నాయా..? ఇలా అన్ని ప్రశ్నలు వాళ్లే అడిగి మన సమస్యలు పరిష్కరిస్తారు. అదే జగనన్న సురక్ష. ఈనెల 23నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. జులై 23 వరకు కొనసాగుతుంది.
జగనన్నకు చెబుదాం అంటూ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఇటీవల ప్రజా సమస్యలను తెలుసుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా జగనన్న సురక్ష అమలు చేయబోతున్నారు. నేరుగా సీఎం జగన్ దీని గురించి అధికారులకు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, గృహసారథులు ఇంటింటికీ వెళ్లి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటారని చెప్పారు సీఎం.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం జగన్.. ఈ కొత్త కార్యక్రమం వివరాలు తెలియజేశారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో ఎంపీడీవో, డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్, ఈవోపీఆర్డీ, మున్సిపాల్టీల పరిధిలో కమిషనర్లు, జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లతో బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగానే ఆయా బృందాలు పర్యటించే తేదీలను ప్రకటించి ప్రజలు ఆయా సమయాల్లో ఇంటిలోనే అందుబాటులో ఉండేలా వాలంటీర్లు జాగ్రత్తలు తీసుకుంటారు.
జగనన్న సురక్షలో భాగంగా ఎవరినైనా సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తిస్తే వారికి ఆగస్టు 1నుంచి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమం కోసం 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వారు ఆయా ప్రాంతాల్లో నెలకు రెండు సార్లు పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.