Telugu Global
Andhra Pradesh

ఇంటర్ విద్యార్థులకు కూడా జగనన్న గోరుముద్ద

ఒక్కో మండలానికి కనీసం రెండు హైస్కూల్స్ ని ఇంటర్‌ కాలేజీలుగా అప్‌ గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. అలా అప్ గ్రేడ్ చేసిన స్కూల్ కమ్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు కూడా గోరుముద్ద కార్యక్రమం అమలు చేస్తామన్నారు మంత్రి బొత్స.

ఇంటర్ విద్యార్థులకు కూడా జగనన్న గోరుముద్ద
X

ఇంటర్ విద్యార్థులకు కూడా జగనన్న గోరుముద్ద

స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతోంది. తమిళనాడులో స్కూల్ పిల్లలకు ఉదయం అల్పాహారం కూడా ఇస్తున్నారు. తెలంగాణలో దసరా నుంచి బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏపీలో బ్రేక్ ఫాస్ట్ జోలికి వెళ్లలేదు కానీ, ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ ఉచిత భోజనం పథకం అమలు చేయాలని ఆలోచిస్తోంది ప్రభుత్వం. త్వరలో ఇంటర్ విద్యార్థులకు జగనన్న గోరుముద్ద మొదలు పెడతామంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

ప్రస్తుతం ఏపీలో 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనానికి గోరుముద్ద అనే పేరు పెట్టారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో ముందుగానే మెను సిద్ధం చేస్తారు, భోజనంతోపాటు చిక్కీలను కూడా పిల్లలకు అందజేస్తున్నారు. అయితే ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే ఇంటర్ విద్యార్థులు మాత్రం ఇంటి దగ్గరనుంచి క్యారేజీలు తెచ్చుకోవాల్సిందే. అక్కడక్కడ సామాజిక హాస్టల్స్ వీరిని అదుకుంటున్నాయి. ఇకపై ఇలాంటి విద్యార్థులందరికీ కాలేజీలోనే ఉచితంగా భోజనం పెట్టేలా ప్రభుత్వం గోరుముద్ద పథకాన్ని విస్తరించాలని చూస్తోంది.

ఏపీ విద్యావ్యవస్థలో సీఎం జగన్ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. నాడు - నేడుతో పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారాయని అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, అమ్మఒడి పథకంతో డ్రాప్‌ అవుట్స్‌ సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వస్తున్నారని చెప్పారు బొత్స. గోరుముద్ద కార్యక్రమానికి 2023-24 విద్యాసంవత్సరంలో సుమారు రూ.1,500 కోట్లకుపైగా ఖర్చు చేయబోతున్నట్టు చెప్పారాయన. ఒక్కో మండలానికి కనీసం రెండు హైస్కూల్స్ ని ఇంటర్‌ కాలేజీలుగా అప్‌ గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. అలా అప్ గ్రేడ్ చేసిన స్కూల్ కమ్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు కూడా గోరుముద్ద కార్యక్రమం అమలు చేస్తామన్నారు మంత్రి బొత్స.

First Published:  26 Sept 2023 12:27 PM IST
Next Story