Telugu Global
Andhra Pradesh

జగనన్న కాలనీలకు బాబు ఫినిషింగ్ టచ్

ఏపీలో పేదలకోసం కట్టిస్తున్న ఇళ్లను సకాలంలో పూర్తి చేసేందుకు కార్యాచరణ, ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు.

జగనన్న కాలనీలకు బాబు ఫినిషింగ్ టచ్
X

ఏపీలో జగనన్న కాలనీలకు చంద్రబాబు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. జగనన్న కాలనీలు - పేదలందరికీ ఇళ్లు పేరుతో ఆ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం పట్టాలెక్కించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం మరికొంత అదనంగా కలిపి ఇచ్చేది. కాలనీల్లో మౌలిక వసతుల పేరుతో వైసీపీ నేతలు కోట్ల రూపాయలు దోచేశారనే అపవాదు కూడా ఉంది. ఈ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. జగనన్న కాలనీల్లో కొన్నిచోట్ల గృహప్రవేశాలు జరిగాయి, చాలా చోట్ల నిర్మాణాలు మొదలే కాలేదు. అయితే ఇప్పుడీ నిర్మాణాలపై కొత్త ప్రభుత్వం నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారింది. గతంలో టిడ్కో ఇళ్లను వైసీపీ నిర్లక్ష్యం చేసినట్టు, జగనన్న కాలనీలపై చంద్రబాబు చిన్నచూపు చూస్తారా అనే అనుమానం చాలామందిలో ఉంది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేశారు ఏపీ గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి.

ఏపీలో పేదలకోసం కట్టిస్తున్న ఇళ్లను సకాలంలో పూర్తి చేసేందుకు కార్యాచరణ, ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారాయన. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రిపోర్ట్ సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలని చెప్పారు. కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తామని, దీనికి సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

జగనన్న కాలనీల్లో మూడు పద్ధతుల ద్వారా గృహనిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి నగదు రూపంలో లబ్ధిపొందినవారు తమకు తామే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ప్రభుత్వ సాయం సామగ్రి రూపంలో తీసుకునేవారు ఉపాధి హామీ కూలీలుగా నిర్మాణాలు పూర్తి చేసుకోవచ్చు. ఇక మూడోరకం ఇంటి నిర్మాణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానికే వదిలేయడం. దీనికోసం కాంట్రాక్టర్లకు ప్రభుత్వం సామగ్రి మంజూరు చేసేది. ప్రభుత్వ నిబంధనల మేరకు వారు ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగించాలి. జగనన్న కాలనీలపై ప్రచారం బాగానే జరిగినా ఇళ్ల నిర్మాణం మాత్రం సకాలంలో పూర్తి కాలేదు. దీంతో చాలా చోట్ల పునాదుల దశలోనే ఇళ్లు ఆగిపోయాయి. మరికొన్ని చోట్ల కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో ఉండటంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి వెనకడుగు వేశారు. కొత్త ప్రభుత్వం ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామంటోంది. ఆప్షన్- 3 కింద నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లతో సమావేశమై సకాలంలో గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి పార్థసారథి.

First Published:  18 Jun 2024 7:51 PM IST
Next Story