Telugu Global
Andhra Pradesh

జగనన్న కాలనీల్లో నేడు సామూహిక గృహప్రవేశాలు

రాష్ట్రవ్యాప్తంగా 17,005 వైఎస్సార్‌ జగనన్న కాలనీలు ఏర్పాటయ్యాయి. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు. వాటిలో రెండు దశల్లో 19.13 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు.

జగనన్న కాలనీల్లో నేడు సామూహిక గృహప్రవేశాలు
X

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా.. ఈరోజు సామూహిక గృహప్రవేశాలు జరగబోతున్నాయి. కాకినాడ జిల్లా సామర్లకోటలో సీఎం జగన్ లాంఛనంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మిగతా ప్రాంతాల్లో జరిగే గృహప్రవేశాల్లో మంత్రులు, ఎమ్మె­ల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా 5.85 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, అన్నిచోట్లా ఈరోజు గృహప్రవేశాలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

సామర్లకోట స్పెషాలిటీ..

కాకినాడ జిల్లా సామర్లకోట-ప్రత్తిపాడు రోడ్ లో జగనన్న కాలనీ ఏర్పాటైంది. ఇళ్ల స్థలాలు, నిర్మాణ ఖర్చుల నిధులు కాకుండా.. లే అవుట్ అభివృద్ధికి ఏకంగా 15కోట్ల రూపాయలు ఖర్చు చేయడం విశేషం. రూ.4 కోట్లతో విద్యుత్ సబ్‌ స్టేషన్, మూడు అంగన్వాడీ కేంద్రాల భవనాలను నిర్మించారు. ఓపెన్‌ జిమ్, చిల్డ్రన్‌ పార్కులు కూడా ఉన్నాయి. ఈ లే అవుట్ లో 824 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.

వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. అయితే జగన్ తన మార్కు చూపించాలనుకున్నారు. టిడ్కో వ్యవహారాన్ని పక్కనపెట్టి, జగనన్న కాలనీల పేరుతో కొత్త ఊళ్లని సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 వైఎస్సార్‌ జగనన్న కాలనీలు ఏర్పాటయ్యాయి. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు. వాటిలో రెండు దశల్లో 19.13 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు. మరోవైపు టిడ్కో ఇళ్లను కూడా పూర్తి చేస్తున్నారు. అదనంగా వైసీపీ హయాంలో 2.62 లక్షల టిడ్కో ఇళ్లను కూడా మంజూరు చేశారు. జగనన్న కాలనీల్లో ఇప్పటికే చాలా చోట్ల ఇళ్లు పూర్తికాగా అనధికారికంగా గృహప్రవేశాలు కూడా జరిగిపోయాయి. ఇప్పుడు సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు.. లాంఛనంగా గృహప్రవేశాల్లో పాల్గొంటున్నారు.

First Published:  12 Oct 2023 8:18 AM IST
Next Story