తండల్ వ్యాపారం చూసి చలించిపోయా.. అందుకే ఈ పథకం
పాదయాత్రలో చిరు వ్యాపారులను పలకరించినప్పుడు పెట్టుబడులకోసం వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసిందని చెప్పారు జగన్. వారి ఇబ్బందులు తొలగించేందుకే జగనన్న తోడు అమలులోకి తెచ్చామన్నారు.
ఏపీలో చిరు వ్యాపారులకు పెట్టుబడిసాయంగా వడ్డీలేని రుణాలు మంజూరు చేసింది ప్రభుత్వం. జగనన్న తోడు పథకంలో భాగంగా మొత్తం 5,10,412 మంది లబ్ధిదారులకు రూ. 560.73 కోట్లను పంపిణీ చేశారు. సీఎం జగన్ బటన్ నొక్కి ఈ సొమ్ముని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో ఉన్న లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు జగన్. పాదయాత్రలో తన అనుభవాల ద్వారా ఈ పథకానికి రూపకల్పన జరిగిందన్నారు.
పాదయాత్రలో చిరు వ్యాపారులను పలకరించినప్పుడు పెట్టుబడులకోసం వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసిందని చెప్పారు జగన్. ఉదయాన్నే 900 రూపాయలు అప్పు తీసుకుని సాయంత్రం వడ్డీతో కలిపి వెయ్యి రూపాయలు కట్టాల్సి వచ్చేదని.. చిరు వ్యాపారులకు ఇది చాలా ఇబ్బందిగా ఉండేదని చెప్పారు. వారి ఇబ్బందులు తొలగించేందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగనన్న తోడు అమలులోకి తెచ్చామన్నారు. ఒక్కక్కరికి రూ. 10 వేల నుంచి రూ. 13 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 56 వేల మందికి జగనన్న తోడు అందిస్తున్నామన్నారు. రూ. 11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్ మెంట్ కూడా విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రూ. 2,955 కోట్ల వడ్డీ లేని రుణం లబ్ధిదారులకు అందించినట్టు తెలిపారు సీఎం జగన్. పేదలకు మంచి చేసే ఈ యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోందన్నారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించినవారికి మళ్లీ రుణాలు ఇస్తున్నామని, వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందిన వారిలో 80 శాతం మంది మహిళలే ఉన్నారని మహిళా సాధికారతకు ఈ పథకం అత్యంత అనుకూలంగా ఉందన్నారు.