జగనన్న ఆరోగ్య సురక్షలో కేసీఆర్ మందులు
బాటిల్ పై తెలంగాణ లేబుల్ ఉన్నా, ఏపీ లేబుల్ ఉన్నా.. రోగులకు అది ఉపయోగపడితే అదే చాలు. అంతకు మించి ఎవరూ అందులో లోపాలు వెతకాల్సిన అవసరం లేదు. కానీ ఏపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే కార్యక్రమంలో కూడా ఇలా పక్క రాష్ట్రాల ఉచిత సరఫరా మందులు వాడితే దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి..?
జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి, బొక్కలు వెతకడానికి ఎల్లో మీడియా ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. ఎన్నికల వేళ నేతలయినా, అధికారులయినా మరింత జాగ్రత్తగా ఉండక తప్పదు. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఓ చోట దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో తెలంగాణ సరఫరా ఉచిత మందుల్ని ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సాక్ష్యం అన్నట్టుగా కొన్ని దగ్గు మందు బాటిళ్ల ఫొటోలను కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఇది పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేయలేం, అదే సమయంలో కేవలం తెలంగాణ తయారీ మందుల్ని ఏపీలో పంపిణీ చేస్తున్నారని అనుకోలేం.
ఆ మాత్రం చూస్కోరా..
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా గొప్పదని, పేదలందరికీ మేలు చేస్తుందని, రోగులందరికీ ఉపశమనం కలిగిస్తుందని, ఎన్నికల వేళ మన మైలేజీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు సీఎం జగన్. అయితే క్షేత్ర స్థాయిలో అధికారులు సకాలంలో మందులు సప్లై చేయలేక చేతులెత్తేస్తున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలే మందుల సరఫరాపై అసహనం వ్యక్తం చేసిన ఉదాహరణలున్నాయి. ఇటీవల యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు మందులు పూర్తిస్థాయిలో లేవంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గ పరిధిలోనే తెలంగాణ మందులు కనపడటం విశేషం. జిల్లా వైద్య అధికారి విద్యాసాగర్ వివరణ మాత్రం విచిత్రంగా ఉంది. మందులు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎవరు సరఫరా చేశారన్నది గమనించలేదని.. అవసరమైన రోగులకు మాత్రమే మందులు ఇస్తున్నామని చెప్పారాయన. బాటిల్ పై తెలంగాణ లేబుల్ ఉన్నా, ఏపీ లేబుల్ ఉన్నా.. రోగులకు అది ఉపయోగపడితే అదే చాలు. అంతకు మించి ఎవరూ అందులో లోపాలు వెతకాల్సిన అవసరం లేదు. కానీ ఏపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే కార్యక్రమంలో కూడా ఇలా పక్క రాష్ట్రాల ఉచిత సరఫరా మందులు వాడితే దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి, అధికారులు ఆమాత్రం ఆలోచించలేదా అనే విమర్శలు వినపడుతున్నాయి.
ఇటీవల గర్భిణీలకు ఇచ్చిన పౌష్టికాహారం ప్యాకెట్ లో పాము కళేబరం కనిపించిందనే విమర్శలొచ్చాయి. అది పాము కళేబరం కాదు ప్లాస్టిక్ ముక్క అంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అక్కడితో ఆ విమర్శ ఆగిపోయినట్టే. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన దగ్గుమందు లేబుల్ స్పష్టంగా కనపడుతోంది. ఇక్కడ కవర్ చేసుకోడానికి ఏమీ లేదు, కింది స్థాయి సిబ్బంది తప్పు అని అధికారులు చేతులు దులుపుకోవచ్చు కానీ, ప్రభుత్వంపై ఎల్లో మీడియా వేసిన బురద కడుక్కోవడం కాస్త కష్టమే.