ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్
నాలుగుసార్లు సీఎంగా చేశానని.. ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్న చంద్రబాబు
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది సమీక్షించాలన్నారు. జాతీయ స్థాయిలో భాగస్వామిగా ఉన్నామని, మూడు పార్టీలు కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్నారు. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు.
అలాగే మాజీ జీఎం జగన్‌పై చంద్రబాబు మండిపడ్డారు. వ్యవస్థలను జగన్ నాశనం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులను కూడా దారి మళ్లించారు. నాలుగు సార్లు సీఎంగా ఉన్నా.. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడదలేన్నారు. టీడీపీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. దేశం, ప్రజల కోసం పాటుపడిందన్నారు. పదవులు తీసుకోకుండా వాజ్‌పేయీ ప్రభుత్వంలో కొనసాగిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.
వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. తనను జైల్లో పెడితే పవన్ వచ్చి పరామర్శించి టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారని గుర్తు చేశారు. మోదీ నుంచి అందరూ నేర్చుకోవాలని.. పట్టుదల, కృషి వల్లనే ఆయన మూడోసారి ప్రధాని అయ్యారని కొనియాడారు. వైసీపీ చేయని తప్పులు లేవని.. అందుకే ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కూటమికి 93 శాతం స్ట్రయిక్‌రేట్ ఇచ్చారన్నారు.