జగన్ వర్సెస్ పీకే.. కొనసాగుతున్న మాటల యుద్ధం
విదేశీ పర్యటనకు ముందు ఏపీ ఫలితాల గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ప్రశాంత్ కిషోర్.
ఎన్నికల తర్వాత ఐప్యాక్ కార్యాలయానికి వచ్చిన సీఎం జగన్, ఫలితాల అంచనాలను చెబుతూ ప్రత్యేకంగా ప్రశాంత్ కిషోర్ పేరు ప్రస్తావించారు. ఈసారి తాము మెరుగైన ఫలితాలు సాధిస్తామని ప్రశాంత్ కిషోర్ అంచనాలను మించి వైసీపీకి సీట్లు వస్తాయన్నారు. 2019లో వైసీపీ విజయాన్ని పీకే ఖాతాలో వేసిన కొంతమందికి ఈ ఎన్నికలతో గట్టిగా బదులిస్తామని పరోక్షంగా జగన్ చెప్పినట్టయింది. ఇప్పుడు పీకే కూడా జగన్ వ్యాఖ్యలకు బదులిచ్చారు. ఏపీలో వైసీపీకి ఓటమి తప్పదని మరోసారి చెప్పారు ప్రశాంత్ కిషోర్.
ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా తప్పుకున్నా ఆయన వ్యాఖ్యానాలకు మాత్రం ఇంకా ప్రాధాన్యత ఉంటోంది. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. దేశంలో ఇంకా పలు ప్రాంతాల్లో ఎన్నికలు మిగిలుండగానే విజయం ఎవరిదో తేల్చేయడం ప్రామాణికం కాకపోయినా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా మారాయి. ఈసారి కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమిదే విజయం అని అంటున్నారు పీకే. బీజేపీపై, మోదీపై దేశవ్యాప్తంగా అసంతృప్తి ఉంది కానీ, ఆగ్రహం లేదంటున్నారు. అందుకే ఈసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో ఏర్పడుతుందని, గతంలో కంటే సీట్లు ఏమాత్రం కూటమికి తగ్గవని తీర్మానించారు పీకే.
ఏపీ గురించి..
విదేశీ పర్యటనకు ముందు ఏపీ ఫలితాల గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు ప్రశాంత్ కిషోర్. ఫలితాలకు ముందే ఏ నాయకుడు కూడా ఓటమిని అంగీకరించరని అన్నారు పీకే. ఓట్ల లెక్కింపు రోజు నాలుగు రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా ఎవరూ ఓటమిని అంగీకరించరని.. రాబోయే రౌండ్లలో తమకు మెజార్టీ వస్తుందని చెబుతుంటారని, ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తారని అన్నారు. చంద్రబాబు గెలుస్తామని చెబితే, జగన్ గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని అంటున్నారని, ఈ చర్చకు అంతం ఉండదని అభిప్రాయపడ్డారు పీకే. తన అంచనా ప్రకారం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఈ ఇంటర్వ్యూని ఎల్లో మీడియా హైలైట్ చేస్తోంది. 2019లో సమష్టిగా పనిచేసిన జగన్, పీకే.. 2024నాటికి వేరు పడ్డారు. మరి వీరిద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందో వేచి చూడాలి.