Telugu Global
Andhra Pradesh

జగన్ యాత్ర ఓట్ల కోసం.. లోకేష్ యాత్ర చప్పట్ల కోసం

యువగళం పాదయాత్ర మొదలైనప్పుడు యువత సమస్యలపై ఆయన ఎక్కువ ఫోకస్ పెడతారనుకున్నారు. కానీ రాను రాను విమర్శలు, పంచ్ డైలాగులు, పవర్ ఫుల్ స్పీచ్ ల వైపు లోకేష్ ఆకర్షితులవుతున్నారు. అలాంటి వాటికే చప్పట్లు వినపడుతుండే సరికి లోకేష్ కూడా ఆ సౌండ్ కే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

జగన్ యాత్ర ఓట్ల కోసం.. లోకేష్ యాత్ర చప్పట్ల కోసం
X

కొడాలి నాని ని నడిరోడ్డుపై కట్ డ్రాయర్ మీద పరిగెత్తిస్తా..

ఒక్కొక్కరి చేత -- పోయించే బాధ్యత నాది...

గన్నవరం యువగళం సభలో నారా లోకేష్ పంచ్ డైలాగులివి. చినబాబు స్పీచ్ అదిరిపోయింది, చినబాబు వైరి వర్గాలకు చుక్కలు చూపించారు, చినబాబు పవర్ ఫుల్ డైలాగులు చెప్పారు.. అంటూ టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. దానికి తగ్గట్టే టీడీపీ అనుకూల మీడియా ఈ వ్యవహారాన్ని బాగా హైలైట్ చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఈ చప్పట్లు, తప్పెట్ల కార్యక్రమం వల్ల ఉపయోగమేంటి..? ఈ సభలకు వచ్చే టీడీపీ కార్యకర్తల ఓట్లు మాత్రమే రేపు ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని సాధించి పెడతాయా..? అసలు లోకేష్ యువగళంలో చేయాల్సిందేంటి, చేస్తున్న దేంటి..?


అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రకు ఇప్పుడు భావి టీడీపీ ఆశాకిరణంగా లోకేష్ చేస్తున్న యాత్రకు మధ్య చాలా తేడా ఉంది. ఊరూవాడా ప్రజల సమస్యలు తెలుసుకోడానికే జగన్ పాదయాత్ర చేశారు. యాత్రలో ఆయన నాయకుల్ని తక్కువ, సామాన్య ప్రజల్ని ఎక్కువగా కలిశారు. సభల్లో టీడీపీపై విమర్శలు చేసినా, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది వివరించడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. జనంలోనే ఉన్నారు, జనంతో తిరిగారు, జనం ఓట్లు కొల్లగొట్టారు, 151 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించారు.

లోకేష్ చేస్తున్నదేంటి..?

లోకేష్ సభలకు వచ్చేవారు పూర్తిగా టీడీపీ కార్యకర్తలు, లోకేష్ తో చర్చల్లో కూర్చునేవారిని కూడా ఏరికోరి తీసుకొస్తున్నారు. ఇక సెల్ఫీ బ్యాచ్ లో టీడీపీ వీరాభిమానులే ఉంటున్నారు. లోకేష్ జనాల్ని తక్కువగా, టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎక్కువగా కలుస్తున్నారు. ఇక్కడే వ్యవహారం తేడా కొడుతోంది.

యువగళం పాదయాత్ర మొదలైనప్పుడు యువత సమస్యలపై ఆయన ఎక్కువ ఫోకస్ పెడతారనుకున్నారు. కానీ రాను రాను విమర్శలు, పంచ్ డైలాగులు, పవర్ ఫుల్ స్పీచ్ ల వైపు లోకేష్ ఆకర్షితులవుతున్నారు. అలాంటి వాటికే చప్పట్లు వినపడుతుండే సరికి లోకేష్ కూడా ఆ సౌండ్ కే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని ప్రాంతానికి చేరుకునే సరికి సభలు, చేరికల హడావిడి ఎక్కువైంది. జనంలో తిరిగి, జనం సమస్యలు తెలుసుకోడానికి లోకేష్ పెద్దగా ఆసక్తి చూపడంలేదు, అన్ని సమస్యలూ తమకు తెలుసని ముందుగానే టీడీపీ తీర్మానించుకోవడం ఇక్కడ అతి పెద్ద మైనస్. మరి లోకేష్ యువగళం ఎంతమేరకు విజయవంతమవుతుందో చూడాలి. సక్సెస్ అని టీడీపీ చెప్పుకోవడం కాదు, ఆ సక్సెస్ వల్ల టీడీపీకి పెరిగే ఓట్లెన్ని, సీట్లెన్ని అనేదే అసలు లెక్క.

First Published:  23 Aug 2023 8:27 AM IST
Next Story