ముందస్తు సంబరాల్లో చంద్రబాబు.. మరి జగన్..?
చంద్రబాబు హడావిడి మాత్రం రోజు రోజుకీ ఎక్కువైంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆయన మరింత రెచ్చిపోతున్నారు. ఇటు జగన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు.
ఎన్నికల తర్వాత జగన్, చంద్రబాబు ఇద్దరూ విదేశాలకు వెళ్లి తిరిగొచ్చారు. తిరిగొచ్చిన తర్వాత చంద్రబాబు హడావిడి ఎక్కువైంది, జగన్ మాత్రం లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ మినహా ఇంకెక్కడా బయటకు కనపడేలా ఆయన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. పార్టీ నేతలతో తాడేపల్లిలో సమావేశాలు జరిగాయంటున్నారు కానీ, ఎక్కడా చిన్న ఫొటో కూడా బయటకు రాలేదు. ఇటు చంద్రబాబు హడావిడి మాత్రం రోజు రోజుకీ ఎక్కువైంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆయన మరింత రెచ్చిపోతున్నారు.
ఎల్లో మీడియా రచ్చ..
చంద్రబాబు పావలా వంతు హడావిడి చేస్తే, ఎల్లో మీడియా రూపాయు వంతు ఎగిరెగిరి పడుతోంది. తాజాగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో సందడి నెలకొంది. పోలింగ్ ముగిశాక ఆయన తొలిసారి పార్టీ ఆఫీస్ కి వచ్చారని, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారని ఎల్లో మీడియా వార్తలిచ్చింది. సీఎం, సీఎం అనే నినాదాలతో ఎన్టీఆర్ భవన్ మారుమోగిందని అంటున్నారు. దీనికి కొసమెరుపుగా చంద్రబాబు పార్టీ శ్రేణులతో చమత్కారం ఆడారని.. "మీ శక్తినంతా ఈరోజే ఖర్చు చేసుకోవద్దు, రేపు ఫలితాల తర్వాత సంబరాలు చేసుకుందామ"ని పిలుపునిచ్చారని ఎల్లో మీడియా కథనాల సారాంశం.
మరి జగన్ సంగతేంటి..?
విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన జగన్ మాత్రం ఆఫీస్ కే పరిమితం అయ్యారు. అంతర్గత సమావేశాలు జరుగుతున్నా.. బయటకు ఎలాంటి సమాచారం లేదు. మీడియా ముందుకు మాత్రం సజ్జల, వైవీ.. ఇతర నేతలు వస్తున్నారు. జగన్ పేరుతో ప్రకటన కానీ, పార్టీ శ్రేణులకు పిలుపు కానీ లేదు. సోషల్ మీడియాలో కూడా ఆయన కనపడలేదు, వినపడలేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా జగన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఆ మధ్య ఓ ట్వీట్ వేయడం మినహా జగన్ సైలెంట్ గా నే ఉన్నారనిపిస్తోంది. తుఫాను ముందు ప్రశాంతత ఇంటే ఇదేనంటూ వైసీపీ నేతలు సర్దిచెప్పుకుంటున్నారు, వైరి వర్గాలు మాత్రం మరో రకంగా కామెంట్ చేస్తున్నాయి. ఈ కామెంట్లు, కవ్వింపులకు టైమ్ దగ్గరపడింది. మరికొన్ని గంటల్లో ఏపీలో అధికారం ఎవరిదో తేలిపోతుంది. ఆ తర్వాత ఎవరి స్థానం ఏంటనేది క్లారిటీ వస్తుంది.