రేపు పులివెందులకు జగన్.. ఎందుకంటే..?
వాస్తవానికి ఈనెల 19న అసెంబ్లీకి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులందరితో జగన్ సమావేశం కావాల్సి ఉంది. కానీ మధ్యలో పులివెందుల టూర్ ఖరారైంది.

వైసీపీ అధినేత జగన్ పులివెందుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రెండు రోజులపాటు ఆయన పులివెందులలో పర్యటిస్తారు. రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గంలో నాయకులకు, ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటారు. శుక్రవారం మధ్యాహ్నం తన పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
వాస్తవానికి ఈనెల 19న అసెంబ్లీకి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులందరితో జగన్ సమావేశం కావాల్సి ఉంది. కానీ మధ్యలో పులివెందుల టూర్ ఖరారైంది. దీంతో ఎమ్మెల్యేలు, వైసీపీ అభ్యర్థులతో జరగాల్సిన మీటింగ్ ని ఈనెల 22కి వాయిదా వేశారు. ఇక ఈనెల 24నుంచి 3రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. ఆ సమావేశాలకు జగన్ సహా వైసీపీ నుంచి గెలిచిన 11మంది ఎమ్మెల్యేలు హాజరవుతారు.
సీఎం హోదాలో జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్తున్నారంటే ఆ సందడే వేరు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పార్టీ ఓటమి తర్వాత తొలిసారి జగన్ పులివెందుల వెళ్తున్నారు. సందడి లేకపోయినా స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో ఆయన్ను కలిసేందుకు పులివెందుల వస్తారని సమాచారం. స్థానికంగా టీడీపీ దాడులపై నేతలతో జగన్ చర్చించే అవకాశముంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా ఆయన నేతలకు కీలక సూచనలు ఇస్తారని తెలుస్తోంది.