Telugu Global
Andhra Pradesh

ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి.. జగన్ బాగా ఇరిటేట్ అయ్యారా..?

అసలు ఏ ప్రభుత్వ హయాంలో అయినా కలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షాలను కానీ, మీడియాను కానీ తిట్టిన ఉదాహరణలున్నాయా. అలా తిడితే ప్రభుత్వం మారిన తర్వాత వారి పరిస్థితి ఏంటి..?

ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి.. జగన్ బాగా ఇరిటేట్ అయ్యారా..?
X

"ఏ మంచిపని చేసినా వక్రీకరిస్తున్నారు. ప్రతిదీ పాజిటివ్‌ గానే తీసుకుందాం. ఆరోపణల్లో నిజం ఉంటే కరెక్ట్‌ చేసుకుందాం. అందులో వాస్తవం లేకపోతే ప్రెస్‌ మీట్‌ పెట్టి గట్టిగా తిట్టండి. అలా చేస్తే వాళ్ల తప్పు మనం ఎత్తి చూపినట్లు అవుతుంది. మనం ప్రజా సేవకులం. పాలన అంటే సేవ అనే విషయాన్ని ప్రతి కలెక్టర్‌ గుర్తుపెట్టుకోవాలి" పెన్షన్లు ఎత్తేస్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై సీఎం జగన్ రియాక్షన్ ఇది. ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి అంటూ కలెక్టర్లకు చెప్పారు జగన్. అసలు ఏ ప్రభుత్వ హయాంలో అయినా కలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షాలను కానీ, మీడియాని కానీ తిట్టిన ఉదాహరణలున్నాయా. అలా తిడితే ప్రభుత్వం మారిన తర్వాత వారి పరిస్థితి ఏంటి..? ఆ తిట్టేదేదో ఎమ్మెల్యేలు, మంత్రులు చేయొచ్చు కదా..? పోనీ వారు తిడితే జనం నమ్మట్లేదు అనుకుంటే నేరుగా జగనే తిట్టొచ్చు కదా..? ప్రెస్ మీట్లు పెట్టి తిట్టండి అంటూ కలెక్టర్లకు, సీఎం చెబుతున్నారంటే.. ఆయన్ను టీడీపీ అనుకూల మీడియా బాగానే ఇరిటేట్ చేసిందని చెప్పాలి.

ముఖ్యంగా పెన్షన్ల తొలగింపు విషయంలో ఇటీవల బాగా రచ్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షా యాభైవేలమందికి పెన్షన్లు తొలగిస్తున్నామంటూ నోటీసులిచ్చారు. వారంతా ఇప్పుడు నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల్ని నిలదీస్తున్నారు. అనర్హులు అని తెలిసినా కూడా చాలామంది వెనక్కి తగ్గట్లేదు. ఇన్నాళ్లూ ఇచ్చారు, ఇప్పుడేమైంది అని అంటున్నారు. పెన్షన్లు పెంచాలని ఎవరడిగారు, పెంచుతున్నామనే సాకుతో మాకు ఆపేయడమేంటని నిలదీస్తున్నారు. దీంతో వైసీపీ నాయకులకు స్థానికంగా నిరసన సెగ తగిలింది. అది అధిష్టానం వరకు చేరింది. దీంతో జగన్ నేరుగా రంగంలోకి దిగారు. అనర్హులకు పెన్షన్లు ఇచ్చేది లేదని చెబుతూనే, వాస్తవాలు ప్రజలకు వివరించాలని కలెక్టర్లకు ఉద్భోదించారు.

ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ టీడీపీ అనుకూల మీడియా వైసీపీని క్లియర్ కట్ గా టార్గెట్ చేస్తోంది. మంత్రులందరిపై వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తులు, అనుచరులు, కబ్జాలు అంటూ సీక్వెన్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలను కూడా వదిలిపెట్టడంలేదు. ఇదే కోవలో పెన్షన్ల వ్యవహారంపై కూడా టీడీపీ అనుకూల మీడియా ఫోకస్ పెట్టింది. అయితే ఇదంతా వక్రీకరణే అనుకుంటే పొరపాటే. అదే నిజమైతే.. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వారు పెన్షన్లు కట్ చేస్తున్నారంటూ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎంతో కొంత నిజం లేకపోతే రీ సర్వేలో న్యాయం చేస్తామంటూ నాయకులు ఎందుకు హామీ ఇస్తారు. పోనీ జగన్ చెప్పినట్టు ఆరు నెలలకోసారి ఆడిట్ జరుగుతుంది, అందులో అనర్హులను ఏరివేస్తున్నారనుకోవచ్చు. అంటే ఇన్నాళ్లూ లక్షా యాభైవేలమంది అనర్హులకు ప్రభుత్వం పెన్షన్ అప్పనంగా ఇచ్చినట్టే లెక్క. దాన్ని రికవరీ చేస్తారా, అసలా ఆలోచన చేసే దమ్ము ఏ ప్రభుత్వానికైనా ఉందా..? అనర్హులున్నారని చెబుతూనే రీసర్వే అంటున్నారు. అంటే కచ్చితంగా ఎక్కడో తప్పు జరిగిందని జగన్ కూడా ఒప్పుకున్నట్టే లెక్క. ఆ తప్పు జరక్కుండా చూసుకోవాలి, లక్షా యాభైవేలమందికి నోటీసులిచ్చేముందే జగన్ లెక్క సరిచేసుకోవాలి. నోటీసులిచ్చాం, దాన్ని మీడియా తప్పుబడితే ఒప్పుకోం అంటే ఎలా..? పైగా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టండి అంటూ కలెక్టర్లకు ఇచ్చిన సందేశం ఇప్పుడు కలకలం రేపుతోంది.

First Published:  27 Dec 2022 2:55 PM IST
Next Story