Telugu Global
Andhra Pradesh

పాఠాలు నేర్చుకుందాం.. సంస్కరణలకు సిద్ధపడదాం

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలకు లీగల్ సెల్ ప్రతినిధుల అవసరం ఉందన్నారు జగన్.

పాఠాలు నేర్చుకుందాం.. సంస్కరణలకు సిద్ధపడదాం
X

"మనది యంగ్ పార్టీ, నాతోపాటు మీరంతా యంగ్ స్టర్సే, మనం ఎదగాల్సింది చాలా ఉంది, సంస్కరణలు చేసుకోవాల్సి ఉంటే, మంచి పాఠాలు ఎక్కడినుంచైనా నేర్చుకోవాల్సి ఉంటే తీసుకుందాం. తీసుకుని వాటిని మనం అలవాటు చేసుకుందాం. మార్పులు చేసుకుంటూ, ఆర్గనైజేషన్ ని ప్రజలకు, జిల్లా నాయకులకు, స్థానిక నాయకులకు దగ్గర చేద్దాం.." అంటూ వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులకు సందేశమిచ్చారు మాజీ సీఎం జగన్. ఈరోజు లీగల్ సెల్ ప్రతినిధులతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. గతంలో ఏ లాయర్ కి కూడా ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేయలేదని, కానీ తమ హయాంలో వైఎస్ఆర్ లా నేస్తం పేరుతో నెల నెలా రూ.5వేలు స్టైపండ్ ఇచ్చామని గుర్తు చేశారు జగన్. కూటమి ప్రభుత్వంలో ఆ ఆర్థిక సాయం నిలిచిపోయిందన్నారు.


రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలకు లీగల్ సెల్ ప్రతినిధుల అవసరం ఉందన్నారు జగన్. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్‌ లను మరింత బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. కార్యకర్తలకి అండగా, తోడుగా నిలబడాలని సూచించారు. మనందరం ఏకతాటిపైకి వచ్చి యుద్ధం చేస్తేనే టీడీపీ అరాచకాల్ని ప్రజలకి చూపగలం అని వివరించారు జగన్.

చెప్పేదొకటి, చేసేదొకటి..

సీఎం చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటి అని విమర్శించారు జగన్. తప్పు చేసిన వారిని వదిలిపెట్టను అని ఆయన స్టేట్ మెంట్ ఇస్తారని, అదే టైమ్ లో వైసీపీ నేతల్ని పోలీసులు కూడా టార్గెట్ చేస్తున్నారని, పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి గోబెల్స్ మీడియా సపోర్ట్ కూడా వైసీపీకి లేదని చెప్పారు జగన్. పార్టీ తరపున కార్యకర్తలకు అండగా నిలవాలని చెప్పారు. తన హయాంలో ఎప్పుడూ దాడుల సంస్కృతి లేదని, కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ నేతల్ని టార్గెట్ చేసి మరీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు జగన్.

First Published:  22 Aug 2024 2:08 PM GMT
Next Story