Telugu Global
Andhra Pradesh

దయచేసి హెచ్చరిస్తున్నా.. జగన్ సెకండ్ వార్నింగ్

ఏపీలో గతంలో ఎన్నడూ లేని చెడు సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలికారన్నారు జగన్. వేంపల్లెలో జరిగిన దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌ రెడ్డిని కడప రిమ్స్ ఆస్పత్రిలో జగన్ పరామర్శించారు.

దయచేసి హెచ్చరిస్తున్నా.. జగన్ సెకండ్ వార్నింగ్
X

ఇటీవల నెల్లూరు జిల్లా జైలు వద్ద సీఎం చంద్రబాబుకి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు జగన్. ఇప్పుడు కడప రిమ్స్ ఆస్పత్రి బయట నిలబడి రెండో వార్నింగ్ ఇచ్చారు. దయచేసి చెబుతున్నా.. చంద్రబాబు నాయుడ్ని హెచ్చరిస్తున్నా అని అన్నారు జగన్. ఇప్పటికైనా ఇలాంటి దాడులు ఆపకపోతే ప్రభుత్వం మారిన రోజు ప్రతీకార దాడులు జరిగే అవకాశముందని చెప్పారు. చంద్రబాబు చేసిన పాపాలు, వారి కార్యకర్తలకు చుట్టుకుంటాయని, ఫలితం అనుభవించక తప్పదని అన్నారు జగన్.


ఏపీలో గతంలో ఎన్నడూ లేని చెడు సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలికారన్నారు జగన్. వేంపల్లెలో జరిగిన దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్‌రెడ్డిని కడప రిమ్స్ ఆస్పత్రిలో జగన్ పరామర్శించారు. 20 ఏళ్ల పిల్లోడు అజయ్ పై దాడి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు జగన్. వాస్తవానికి కడప ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా పులివెందుల వెళ్లాల్సి ఉన్నా.. దాడి ఘటన తెలుసుకున్న జగన్ కడప రిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ ని కలిశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దాడి ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే విషయాలను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు జగన్.


దాడులు కాదు, పాలన చూడండి..

చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే పది శాతం ఓట్లు ఆయనకు ఎక్కువగా పడ్డాయని చెప్పారు జగన్. దాడులను ప్రోత్సహించకుండా ముందు పాలన సంగతి చూడాలని చంద్రబాబుకి హితవు పలికారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీశారు. దాడులపై కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టిసారించాలన్నారు. దాడులకు గురైన కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు జగన్.

First Published:  6 July 2024 3:04 PM IST
Next Story