Telugu Global
Andhra Pradesh

క‌న్నాపై జగన్ కొత్త అస్త్రాన్ని రెడీ చేశారా?

వచ్చే ఎన్నికల్లో కన్నా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఒకవేళ కన్నా గనుక సత్తెనపల్లి నుండి పోటీ చేయటం ఖాయమైతే గెలుపును అడ్డుకునేందుకు జగన్ ప్లాన్ చేశారు.

క‌న్నాపై జగన్ కొత్త అస్త్రాన్ని రెడీ చేశారా?
X

రాబోయే ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణను ఓడించటమే టార్గెట్‌గా జగన్మోహన్ రెడ్డి కొత్త అస్త్రాన్ని రెడీ చేశారా? అని అనిపిస్తోంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డిని వైసీపీలో చేర్చుకోవటం ద్వారా జగన్ స్పీడుగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కన్నా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఒకవేళ కన్నా గనుక సత్తెనపల్లి నుండి పోటీ చేయటం ఖాయమైతే గెలుపును అడ్డుకునేందుకు జగన్ ప్లాన్ చేశారు.

తన ప్లానులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే యర్రంను పార్టీలో చేర్చుకున్నారు. యర్రం కాంగ్రెస్ పార్టీ తరపున సత్తెనపల్లిలో 2004, 09 ఎన్నికల్లో గెలిచారు. తర్వాత 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసి 9279 ఓట్లతో మూడో ప్లేసుతో సరిపెట్టుకున్నారు. యర్రంకు నియోజకవర్గంలో మంచిపట్టుంది. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గంలో మంచి పేరుందట. రెడ్లతో పాటు వివిధ సామాజికవర్గాలందరితోనూ మాజీ ఎమ్మెల్యే బాగుంటారనే పాజిటివ్ టాక్ ఉంది. అలాంటి యర్రంను వ్యూహాత్మకంగానే జగన్ పార్టీలో చేర్చుకున్నారు.

ఇప్పుడు ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి రాంబాబు మీద నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అంబటికి టికెట్ ఇస్తారో లేదో తెలీదు. ఒక వేళ అంబటికి టికెట్ ఇవ్వకపోతే యర్రంను పోటీలోకి దింపాలని జగన్ అనుకుంటున్నారట. అందుకనే యర్రంతో పాటు ఆయన కొడుకు నితిన్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకున్నారు. తండ్రి, కొడుకుల్లో ఎవరో ఒకరు పోటీలో ఉంటారనే ప్రచారం పెరిగిపోతోంది. యర్రం వైసీపీలో చేరటంపై నియోజకవర్గంలో సానుకూల పవనాలు కనబడుతున్నాయని సమాచారం.

సత్తెనపల్లిలో రెడ్డి, కాపు సామాజవకర్గం ఓట్లు ఎక్కువ. ఈ రెండింటి కాంబినేషన్‌తో రాబోయే ఎన్నికలను ఎదుర్కొంటే వైసీపీ గెలుపు ఖాయమని జగన్ అనుకుంటున్నారు. 2014లో ఇక్కడ ఓడిపోయిన అంబటి 2019లో గెలిచారు. కాపు నేత అయిన‌ అంబటికి కొంత పట్టుంది. అందుకనే యర్రం+అంబటి కాంబినేషన్‌తో వైసీపీని గెలిపించుకోవాలన్నది జగన్ వ్యూహం. ఈ వ్యూహం ద్వారా కన్నాను ఓడించవచ్చని జగన్ అనుకుంటున్నారు. మరి దీనికి విరుగుడుగా కన్నా, చంద్రబాబునాయుడు ఏమి వ్యూహం పన్నుతారో చూడాలి. ఎందుకంటే టికెట్ విషయంలో కన్నాకు విపరీతమైన పోటీ ఉంది. అందరు కన్నాకు సహకరిస్తే గట్టి పోటీ ఇవ్వగలరు. లేకపోతే మాత్రం కష్టమే.

First Published:  12 May 2023 12:07 PM IST
Next Story