టార్గెట్ 175.. జగన్ నోట మళ్లీ అదే మాట
పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయించాల్సిన బాధ్యత వారిదేనన్నారు.
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైమ్ ఉండగానే.. వైసీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లినట్టు స్పష్టంగా తెలుస్తోంది. సీఎం జగన్ రెండేళ్ల ముందుగానే ఎమ్మెల్యేలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మొదలు పెట్టేలా చేశారు. మొక్కుబడిగా కాకుండా ఆ కార్యక్రమంపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసిన జగన్, తాజాగా పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ లతో సమావేశమయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయించాల్సిన బాధ్యత వారిదేనన్నారు.
బాధ్యత మీదే..
ఎమ్మెల్యేలపై పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లకు ఉందని స్పష్టం చేశారు సీఎం జగన్. పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెట్టాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదేనన్నారు జగన్. ఎమ్మెల్యేలతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేయించాల్సింది వారేనని చెప్పారు. బలహీనమైన నియోజకవర్గాలపై దృష్టిపెట్టాలని చెప్పారు. ఎమ్మెల్యేలు వీక్ గా ఉన్నచోట వారిని బలపరిచే బాధ్యత జిల్లా అధ్యక్షులు తీసుకోవాలన్నారు. నెలనెలా తాను ఎమ్మెల్యేలతో మాట్లాడతానని, వారం వారం జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ చార్జిని నియమించబోతున్నట్టు ప్రకటించారు.
ఐ ప్యాక్ టీమ్ పరిచయం..
పార్టీ కోసం పనిచేస్తున్న ఐ ప్యాక్ టీమ్‌ని జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లకు పరిచయం చేశారు సీఎం జగన్. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వంపై ఐ ప్యాక్ టీమ్ ప్రత్యేక నివేదికను అందించింది. ఆ నివేదిక ప్రకారమే గడప దాటని ఎమ్మెల్యేలకు తలంటారు జగన్. ఐప్యాక్ తో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని, వారి సలహాలు తీసుకోవాలని జిల్లా పార్టీ అధ్యక్షులకు సూచించారు. 175 స్థానాలు మన టార్గెట్ అని మరోసారి గుర్తు చేశారు జగన్. గతంలో ఓడిపోయిన స్థానాలపై ఈసారి ఫోకస్ పెంచాలని, అన్ని స్థానాల్లో గెలిచే విధంగా కృషి చేయాలన్నారు.