Telugu Global
Andhra Pradesh

నేడు జగన్ మరో పరామర్శ..

వినుకొండ ఘటనను వ్యక్తిగత దాడిగా అభివర్ణించిన టీడీపీ నేతలు, నంద్యాల హత్యపై మాత్రం కామెంట్ చేయడంలేదు.

నేడు జగన్ మరో పరామర్శ..
X

ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికల విజయం కోసం వరుస మీటింగ్ లు నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్, మరోవైపు పరామర్శ యాత్రలతో కూడా బిజీగా ఉన్నారు. ఇటీవల విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించిన ఆయన, ఈరోజు నంద్యాల జిల్లాలో పర్యటించబోతున్నారు. రాజకీయ దాడిలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చేందుకు జగన్ నంద్యాల వెళ్తున్నట్టు పార్టీ శ్రేణులు తెలిపాయి.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. కొన్నిచోట్ల బాధితుల వద్దకు నేరుగా వెళ్లి జగన్ పరామర్శిస్తున్నారు. వినుకొండలో రషీద్ అనే యువకుడు నడిరోడ్డులో హత్యకు గురికాగా.. ఆ కుటుంబాన్ని జగన్ వెళ్లి పరామర్శించారు. అక్కడినుంచే ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. పొలిటికల్ దాడులు ఆపకపోతే రేపు అధికారం కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ఇది అలవాటుగా మారకూడదని హెచ్చరించారు. ఆ తర్వాత ఢిల్లీలో ధర్నా చేపట్టారు.

జగన్ ధర్నా తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు వచ్చినట్టు కనపడ్డంలేదు. నంద్యాలలో సుబ్బరాయుడు అనే వైసీపీ నేత ఇంటిపై రాజకీయ దాడి జరిగింది. పోలీసులు చూస్తుండగానే సుబ్బరాయుడిని ప్రత్యర్థులు మట్టుబెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు జగన్ వస్తున్నారు.

వినుకొండ ఘటనను వ్యక్తిగత దాడిగా అభివర్ణించిన టీడీపీ నేతలు, నంద్యాల హత్యపై మాత్రం కామెంట్ చేయడంలేదు. ఇది పొలిటికల్ దాడి అని, ఆయన్ని హతమార్చింది ప్రత్యర్థి వర్గం అని తేలిపోయింది. దీంతో ప్రభుత్వం మౌనంగా ఉంది. వైసీపీ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

First Published:  9 Aug 2024 1:08 AM GMT
Next Story