తాడేపల్లిలో వరుస భేటీలు.. రేపు పులివెందులకు జగన్
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఈరోజు తాడేపల్లిలో జగన్ ని కలిశారు.
తాడేపల్లిలో జగన్ మళ్లీ బిజీ అయిపోయారు. పార్టీ నేతలతో ఈరోజు కూడా కీలక భేటీలు నిర్వహించారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు జగన్ ని కలిసేందుకు తాడేపల్లి వచ్చారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు @ysjagan గారిని తన క్యాంపు కార్యాలయంలో కలిసిన ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డి, ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు. pic.twitter.com/n8VUpEcXAR
— YSR Congress Party (@YSRCParty) July 5, 2024
ఏపీ రాజకీయాల్లో విమర్శల జోరు మళ్లీ పెరిగింది. జగన్ నెల్లూరు పర్యటనపై కూడా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కూడా గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేశారన్నారు. ఇక శ్వేతపత్రాల హడావిడి కూడా ఏపీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. వీటన్నిటికీ కౌంటర్లు ఇస్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా జగన్ అడుగులు వేయాల్సిన సందర్భం వచ్చింది. దీంతో జగన్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రేపు పులివెందులకు..
ఇటీవలే పులివెందుల పర్యటన ముగించుకుని ఆ తర్వాత బెంగళూరు వెళ్లారు జగన్. తాజాగా ఆయన మరోసారి పులివెందుల వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రేపటినుంచి మూడు రోజులపాటు ఆయన పులివెందులలోనే ప్రజలకు అందుబాటులో ఉంటారు. రేపు(శనివారం) ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి జగన్ గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడినుంచి కడపకు వెళ్తారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు.