Telugu Global
Andhra Pradesh

జగన్ తప్పు చేశారా?

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటి బిల్లుకు వైసీపీ మద్దతిచ్చి తప్పు చేసింది. రాజ్యాంగానికి లోబడే ఢిల్లీ ఆర్డినెన్సును తీసుకొచ్చినట్లు విజయసాయిరెడ్డి చెప్పటమే విచిత్రంగా ఉంది.

జగన్ తప్పు చేశారా?
X

నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్వీసు బిల్లుకు మద్దతు ఇవ్వటం ద్వారా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారనే అనిపిస్తోంది. ప్రజాస్వామ్యబద్దంగా ఢిల్లీ ప్రభుత్వానికి సంక్రమించిన అధికారాలను మోడీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్సు, బిల్లు రూపంలో హరించేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే పెరిగిపోతున్న మంట కారణంగా ప్రజా ప్రభుత్వ అధికారాలకు మోడీ ప్రభుత్వం కత్తెర్లు వేసింది. మోడీ ప్రభుత్వానికి కేజ్రీవాల్ పంటిలో రాయిలాగ తయారయ్యారు. కేజ్రీవాల్ అడ్డు తొలగించుకోవాలంటే మోడీకి సాధ్యంకావటంలేదు. అందుకనే అధికారాలకు అంటకత్తెర వేసేశారు.

ఢిల్లీ సర్వీసు బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిన కారణంగా ఢిల్లీ ప్రభుత్వం కేవలం ఉత్సవ విగ్రహంలాగ మారిపోయింది. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కేవలం ప్రోటోకాల్‌కు మాత్రమే పరిమితమయ్యారంతే. ఢిల్లీ మీద ప్రజలు ఎన్నుకున్న‌ ప్రభుత్వానిదే ఆజమాయిషి అని సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పినా మోడీ అందుకు అంగీకరించలేదు. ముందు ఆర్డినెన్సు ద్వారా ఇప్పుడు బిల్లు రూపంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం లాగేసుకుంది. తెల్లారిలేస్తే విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి మోడీ చెప్పినట్లుగా ఎవరు చెప్పరు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటి బిల్లుకు వైసీపీ మద్దతిచ్చి తప్పు చేసింది. రాజ్యాంగానికి లోబడే ఢిల్లీ ఆర్డినెన్సును తీసుకొచ్చినట్లు విజయసాయిరెడ్డి చెప్పటమే విచిత్రంగా ఉంది. పైగా సుప్రింకోర్టు మార్గదర్శకాలకు బిల్లు లోబడి ఉండటం వల్లే తాము మద్దతిచ్చినట్లు సమర్ధించుకోవటం మరీ విచిత్రం. మరిదే సుప్రిం కోర్టు ఢిల్లీపై ప్రజా ప్రభుత్వానిదే అధికారమని చెప్పిన విషయాన్ని విజయసాయి మరచిపోయారా? జగన్ తప్పు చేశారంటే అర్థ‌ముంది. మరి చంద్రబాబునాయుడు కూడా బిల్లుకు ఎందుకు మద్దతిచ్చారో అర్థంకావటంలేదు.

ఈ రోజు ఢిల్లీ ప్రభుత్వం అధికారాలను మోడీ ప్రభుత్వం హరించేసింది. రేపు ఇంకేదో కారణాలను చూపించి ఏపీ ప్రభుత్వం అధికారాలను హరించేస్తామంటే జగన్, విజయసాయి ఒప్పుకుంటారా? ఈ రోజు సమస్య వచ్చింది కేజ్రీవాల్‌కు కదాని అనుకుంటే రేపు జగన్‌కూ రావచ్చు. కేవలం వ్యక్తిగత సమస్యల్లో నుండి బయటపడటానికే కేంద్రం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు జగన్ మద్దతిస్తున్నట్లు అర్థ‌మవుతోంది. తాజా బిల్లుకు మద్దతివ్వటం ద్వారా జగన్ పెద్ద తప్పు చేసినట్లే అనిపిస్తోంది. రేపు ఏదో కారణంతో వైసీపీ ప్రభుత్వం అధికారాలకు కత్తెరేస్తే కానీ జగన్‌కు నొప్పి తెలీదు.

First Published:  8 Aug 2023 11:35 AM IST
Next Story