జగన్ మడమ తిప్పేసినట్లేనా?
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే ఉక్కు ఫ్యాక్టరీపై పదేపదే జగన్ ఊదరగొట్టేవారు. వైసీపీ అధికారంలోకి వస్తే శంకుస్ధాపన చేసిన మూడున్నరేళ్ళల్లోనే పనులు పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని చాలా మాటలు చెప్పారు. మరి అప్పడు చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చారు శంకుస్ధాపన కూడా చేశారు.
మడమ తిప్పను..మాట తప్పను అని రెగ్యులర్‌గా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట. అంటే అర్ధం.. ఇచ్చిన మాటను తప్పను..వెనక్కిపోను అని. కానీ ఈ విషయంలో మాత్రం జగన్ మాట తప్పటమే కాదు మడమ కూడా తిప్పేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే సొంత జిల్లాలోని జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్ళ గ్రామంలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్ధాపన చేశారు. శంకుస్ధాపన చేసి మూడేళ్ళవుతున్నా ఇంతవరకు పనులు అడుగు కూడా ముందుకు పడలేదు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే ఉక్కు ఫ్యాక్టరీపై పదేపదే జగన్ ఊదరగొట్టేవారు. వైసీపీ అధికారంలోకి వస్తే శంకుస్ధాపన చేసిన మూడున్నరేళ్ళల్లోనే పనులు పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని చాలా మాటలు చెప్పారు. మరి అప్పడు చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చారు శంకుస్ధాపన కూడా చేశారు. ఇది జరిగి మూడేళ్ళయినా ఇంతవరకు అసలు పనులు ఎందుకు మొదలుకాలేదో జగనే సమాధానం చెప్పాలి. నిజానికి విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే.
చాలా విభజన హామీలను తుంగలో తొక్కేసినట్లుగానే దీన్నికూడా నరేంద్ర మోడీ సర్కార్ తుంగలో తొక్కేసింది. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా ఫ్యాక్టరీని నిర్మించే అవకాశం లేదు. ఎందుకంటే దీని నిర్మాణానికి, నిర్వహణకు వేలాది కోట్ల రూపాయలు అవసరం. పోనీ ప్రభుత్వ భాగస్వామ్యంలో కాకుండా ప్రైవేటు రంగానికి అప్పగించారా అంటే అదీ చేయలేదు. ఊరికే శంకుస్ధాపన చేసి వదిలేశారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో జగన్ ఇప్పుడన్నా ఈ విషయమై మాట్లాడుతారేమో చూడాలి.
ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి కెపాసిటి ఉన్న ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే సుమారు 30 వేలమందికి ఉద్యోగ, ఉపాధి దొరుకుతుంది. కడప జిల్లాతో పాటు యావత్ రాయలసీమకు ఉక్కుఫ్యాక్టరీ ఎంతో ముఖ్యం. అలాంటిది ఇంతటి కీలకమైన ఫ్యాక్టరీని జగన్ ఎందుకు పట్టించుకోవటం లేదో అర్ధంకావటంలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సాధ్యం కానపుడు ప్రైవేటు రంగంలో అయినా పూర్తి చేయించి ఉంటే బాగుండేది. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడితే దీనికి అనుబంధంగా మరెన్నో పరిశ్రమలొచ్చుండేవి. మరి సొంత జిల్లాలోనే మడమ తిప్పేసిన జగన్ ఏమని సమాధానం చెబుతారు?