Telugu Global
Andhra Pradesh

జగన్ కి 175, లోకేష్ కి 160.. పాపం నోరు తెరవని పవన్

రేపు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు ఖాయం అని అన్నారాయన. జగన్‌ లాగా 175 సీట్లు వస్తాయని అతిశయోక్తులు తాము చెప్పుకోవడం లేదని, తమకు మాత్రం 160 సీట్లు పక్కా అన్నారు.

జగన్ కి 175, లోకేష్ కి 160.. పాపం నోరు తెరవని పవన్
X

జగన్ కి 175, లోకేష్ కి 160.. పాపం నోరు తెరవని పవన్

ఇవి సర్వే ఫలితాలు కావు, ప్రీ పోల్స్ అభిప్రాయాలు కావు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంతకంటే కావు.. ఆయా పార్టీల నమ్మకాలు. ఇంకా చెప్పాలంటే దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లలో గెలవబోతోందో ముందే ఊహించి చెప్పేసుకుంటున్నారు అధినాయకులు. ఆమేరకు టార్గెట్లు ఫిక్స్ చేసుకున్నారు.

వైనాట్ 175

టార్గెట్ మంచిదే, కానీ పెద్దది. అయినా రీచ్ అవుతామంటున్నారు జగన్. నేరుగా లబ్ధిదారుల బ్యాంకుల్లోకే ఆర్థిక ఫలాలు చేరిపోతున్నాయి కాబట్టి ఇక మనకు అడ్డేముంది అని ఆయన నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలు అంచనా వేయలేదు. ఆ ఘన విజయమే ఇప్పుడు మరింత ఘన విజయపు అంచనాలకి బాటలు వేసింది. 175 సీట్లు పక్కా అంటూ జగన్ ముందుకెళ్తున్నారు. ఎక్కడే ఏ చిన్న తేడా వచ్చినా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమానం ఉంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం పక్కనపెట్టి ఇన్ చార్జ్ లను నియమిస్తున్నారు. మిగతా పార్టీలన్నీ కలసి వచ్చినా, విడివిడిగా వచ్చినా.. జగన్ టార్గెట్ మాత్రం 175.

లోకేష్ టార్గెట్ 160

రాష్ట్రంలో ఖాయంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని తాజాగా జోస్యం చెప్పారు నారా లోకేష్. సీఎం జగన్ కేసుల నుంచి కాసుల దాకా అనేక సమస్యల్లో కూరుకుపోయారని, అవి ఆయనను ముంచేసే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయుంచుకున్నారని చెప్పారు. రేపు ఎన్నికలు జరిగినా టీడీపీకి 160 సీట్లు ఖాయం అని అన్నారాయన. జగన్‌ లాగా 175 సీట్లు వస్తాయని అతిశయోక్తులు తాము చెప్పుకోవడం లేదని, తమకు మాత్రం 160 సీట్లు పక్కా అన్నారు. ఆ 15 సీట్లను మాత్రం ఎందుకో వదిలిపెట్టారు.

పవన్ సంగతేంటి..?

జగన్ 175 అన్నారు, లోకేష్ 160 అన్నారు. కనీసం పవన్ కల్యాణ్ తమ పార్టీ 175 నియోజకవర్గాల్లో అయినా పోటీ చేస్తుందా లేదా అనే విషయాన్ని ఇంకా చెప్పలేకపోతున్నారు. ఇదే విషయంలో ఇప్పటికే చాలాసార్లు వైసీపీ నేతలు పవన్ పై సెటైర్లు వేశారు. కరెక్ట్ గా ఎన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందో చెప్పమనండి అంటూ ఎద్దేవా చేశారు. కానీ పవన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. జగన్ ని ఓడించడమే తన టార్గెట్ అంటున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకుండా కాపు కాయడమే తన లక్ష్యం అంటున్నారు.

మొత్తమ్మీద తెలంగాణకంటే ఎన్నికలు ఏడాది ఆలస్యంగా జరగాల్సిన ఏపీలోనే రాజకీయాలు బాగా హీటెక్కాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, ఫోన్ ట్యాపింగ్ లు, ఫిరాయింపులు.. ఇలా వ్యవహారం జోరుగా సాగుతోంది. అధినాయకులు కూడా భారీగా టార్గెట్లు పెట్టుకున్నారు. మరి ఎవరి బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందో వేచి చూడాల్సిందే.

First Published:  9 Feb 2023 9:35 AM IST
Next Story