Telugu Global
Andhra Pradesh

షా-చంద్రబాబు భేటీకి జగనే కారణమా?

ఇంతకీ విషయం ఏమిటంటే జగన్‌ను ఎన్డీయేలో చేరాలని నరేంద్ర మోడీ, అమిత్ షా ఒత్తిడి పెట్టారట. అయితే అందుకు జగన్ అంగీకరించలేదని తెలిసింది.

షా-చంద్రబాబు భేటీకి జగనే కారణమా?
X

వినటానికి కాస్త విచిత్రంగానే ఉన్నా ఇందులో లాజిక్ ఉంది. ఇంతకాలం చంద్రబాబునాయుడును దూరంగా పెడుతున్న బీజేపీ పెద్దలు సడెన్‌గా భేటీ అయ్యారు. ఢిల్లీలో అమిత్ షా, చంద్రబాబు భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ భేటీ ఎందుకు జరిగిందనే చర్చలు జరుగుతుండగానే ఏపీలో పర్యటించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. నాలుగేళ్ళల్లో జగన్‌పై చేయని అవినీతి ఆరోపణలు చేయటం, దాన్ని జగన్ తిప్పికొట్టడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

రాజకీయాలు వేడెక్కటమే కాకుండా చిత్రవిచిత్రమైన మలుపులు కూడా తిరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయటం తథ్యమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. అసలు ఇలాంటి మార్పు సడెన్‌గా ఎందుకొచ్చింది? ఎందుకంటే దీనికి జగనే కారణమని సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్‌ను ఎన్డీయేలో చేరాలని నరేంద్ర మోడీ, అమిత్ షా ఒత్తిడి పెట్టారట. అయితే అందుకు జగన్ అంగీకరించలేదని తెలిసింది. తాను గనుక ఎన్డీయేలో చేరితే రాష్ట్ర ప్రజలకు బీజేపీ మీదున్న మంట తనమీద కూడా ప్రభావం చూపుతుందని జగన్ అనుకున్నారు.

దక్షిణాదిలో బీజేపీకి తమిళనాడులో తప్ప ఇంకే రాష్ట్రంలోనూ మిత్రపక్షంలేదు. అక్కడ కూడా రెండు పార్టీల మధ్య పెద్దగా సఖ్యత లేదు. రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని మోడీ చాలా పట్టుదలగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎన్డీయేని బలోపేతం చేయకపోతే మూడోసారి గెలుపు సాధ్యంకాదని అర్థ‌మైంది. ఉత్తరాధిలో బీజేపీపైన వ్యతిరేకత పెరిగిపోతున్న కారణంగా మోడీ దృష్టి దక్షిణాదిపైన పడిందట. అందుకనే జగన్‌ను ఎన్డీయేలో చేరమని అడిగింది.

అయితే జగన్ అంగీకరించపోవటంతో ప్రత్యామ్నాయం వైపు మోడీ చూడాల్సొంచ్చింది. ఎన్డీయేని బలోపేతం చేయటంలో భాగంగానే పాత మిత్రులకు ఆహ్వానాలు పంపుతున్నారు. కర్నాటకలో జేడీఎస్‌ను చేర్చుకోవటం ఇందులో భాగమే. ఇదే కారణంతోనే చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారట. ఒకవైపు ఏమో కర్నాటకలో కాంగ్రెస్ విజయంతో జాతీయ స్థాయిలో సమీకరణలు మారిపోతున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేయటానికి చాలా పార్టీలు రెడీ అవుతున్నాయి. పొత్తులు పెట్టుకోవటంలో భాగంగా చంద్రబాబును దగ్గరకు తీసుకోక మోడీకి వేరే దారి కనిపించలేదట.

First Published:  15 Jun 2023 11:14 AM IST
Next Story