Telugu Global
Andhra Pradesh

జగన్ ఫార్ములా ఇదేనా..?

తన వర్గాన్ని చెల్లుబోయిన బాగా టార్గెట్ చేస్తున్నారట. తన వర్గాన్ని కాపాడుకోవాలన్నా, నియోజకవర్గంలో పగ్గాలు మళ్ళీ తనకు రావాలన్నా చెల్లుబోయినను వ్యతిరేకించటమే మార్గమని పిల్లి అనుకున్నట్లు సమాచారం.

జగన్ ఫార్ములా ఇదేనా..?
X

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వివాద పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి తనదైన ఫార్ములాను రెడీ చేసినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఇక్కడనుండి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణే పోటీచేస్తారని ఎంపీ, జిల్లా ఇన్చార్జి మిథున్ రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనతో రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోసు మండిపోయారు. ఎందుకంటే తన కొడుకు సూర్యప్రకాష్ ను పోటీలోకి దింపాలని పిల్లి అనుకుంటున్నారు. అయితే ఇది బయటకు కనిపించే కారణం మాత్రమేనట.

అసలైన కారణం ఏమిటంటే.. తన వర్గాన్ని చెల్లుబోయిన బాగా టార్గెట్ చేస్తున్నారట. తన వర్గాన్ని కాపాడుకోవాలన్నా, నియోజకవర్గంలో పగ్గాలు మళ్ళీ తనకు రావాలన్నా చెల్లుబోయినను వ్యతిరేకించటమే మార్గమని పిల్లి అనుకున్నట్లు సమాచారం. అందుకనే జగన్ నిర్ణయాన్ని సైతం పిల్లి తీవ్రంగా వ్యతిరేకించింది. ఒకవేళ చెల్లుబోయినకే టికెట్ ఇస్తే పిల్లి లేదా ఆయన కొడుకు ఇండిపెండెంటుగా పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే వైసీపీ ఓడిపోవటం ఖాయం. అందుకనే జగన్ రెండు రకాలుగా ఆలోచిస్తున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. జగన్ కు పిల్లి అత్యంత సన్నిహితుడు. కాబట్టి పిల్లిని జగన్ ఎట్టిపరిస్ధితుల్లోనూ వదులుకోరు. మంత్రి చెల్లుబోయిన‌ పిల్లి వర్గాన్ని మాత్రమే కాదు ఎంఎల్సీ, మండపేట ఇన్చార్జి తోట త్రిమూర్తులు వర్గాన్ని కూడా రామచంద్రాపురంలో బాగా ఇబ్బంది పెడుతున్నట్లు జగన్ కు సమాచారం ఉందట. అందుకనే మొదటి ఫార్ములా ఏమిటంటే చెల్లుబోయినను మంత్రిగా రాజీనామా చేయించి ఆ ప్లేసులోకి మరో ఎంఎల్సీ, శెట్టిబలిజల్లో బలమైన పట్టున్న కుడిపూడి సూర్యనారాయణను తీసుకోవటం.

దీనివల్ల ఇటు పిల్లి అటు తోట ఇద్దరు హ్యాపీగా ఫీలవుతారు. మంత్రివర్గం నుండి తప్పిస్తే వేణుని మండపేట ఇన్చార్జి చేస్తారట. మండపేట ఇన్చార్జిగా ఉన్న తోటను రాబోయే ఎన్నికల్లో రామచంద్రాపురంలో పోటీచేయిస్తారు. నిజానికి తోటది రామచంద్రాపురమే. ఇక్కడినుండి తోట నాలుగుసార్లు గెలిచారు. పైగా పిల్లి, తోట మంచి స్నేహితులు కూడా. కాబట్టి రామచంద్రాపురం సమస్య పరిష్కారమవుతుంది. ఇక రెండోఫార్ములా ప్రకారం వేణుని వదులుకోకూడదని అనుకుంటే మండపేట ఇన్చార్జిని చేస్తారు.

రాజోలు ఎస్సీ నియోజకవర్గం అవటంతో మంత్రి వేణుకు నియోజకవర్గం లేకుండాపోయింది. అందుకనే రామచంద్రాపురంలో పోటేచేయించింది. ఇప్పుడు మండపేటకు మారిస్తే మంత్రికి నియోజకవర్గం దొరుకుతుంది. మంత్రిని గెలిపించే బాధ్యతలను కుడిపూడికి అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు. కుడిపూడి, చెల్లుబోయిన ఇద్దరు శెట్టిబలిజ నేతలే కాబట్టి ఇబ్బంది ఉండదు. రెండో ఫార్ములానే జగన్ అమలుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ రెండు ఫార్ములాలపై మిథున్ చర్చించిన తర్వాతే పిల్లి కూడా శాంతించినట్లు సమాచారం. చివరకు ఏమవుతుందో చూడాలి.

First Published:  26 July 2023 11:59 AM IST
Next Story