Telugu Global
Andhra Pradesh

పాదయాత్రకు ప్రభుత్వమే ప్రచారం కల్పిస్తోందా..?

అనుమతులు ఇవ్వడంలో పోలీసులు ఎంత లేటుచేస్తే టీడీపీ అంత రచ్చచేస్తుంది. ఏ విషయంలో అయినా టీడీపీ చేసే రచ్చ ఎలాగుంటుందో ప్రభుత్వపెద్దలకు బాగాతెలుసు.

పాదయాత్రకు ప్రభుత్వమే ప్రచారం కల్పిస్తోందా..?
X

పాదయాత్రకు ప్రభుత్వమే ప్రచారం కల్పిస్తోందా..?

ఈనెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ చేయదలచుకున్న పాదయాత్రకు ప్రభుత్వమే ప్రచారం కల్పిస్తున్నదా..? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేసేందుకు లోకేష్ సిద్ధ‌మ‌య్యారు. 400 రోజుల పాటు జరిగే పాదయాత్రలో 175 నియోజకవర్గాలను టచ్ చేయాలని రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. పాదయాత్రకు ఓవరాల్‌గా పర్మిషన్ కోసం డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఈనెల 12వ తేదీనే టీడీపీ లేఖలు రాసింది.

అలాగే జిల్లాల్లో ఎక్కడికక్కడ పర్మిషన్లు కావాలంటే.. మళ్ళీ జిల్లాల ఎస్సీలకు కూడా లేఖలు రెడీ చేసింది. ఇందులో భాగంగానే చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలకు కూడా లేఖలు రాసింది. అయితే ఇంతవరకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. ఇక్కడే ప్రభుత్వ వైఖరిపై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమతులు ఇవ్వడంలో పోలీసులు ఎంత లేటుచేస్తే టీడీపీ అంత రచ్చచేస్తుంది. ఏ విషయంలో అయినా టీడీపీ చేసే రచ్చ ఎలాగుంటుందో ప్రభుత్వపెద్దలకు బాగాతెలుసు. విషయం గోరంతైనా దాన్ని కొండంతగా చేసి పబ్లిసిటీ సంపాదించుకుంటుంది.

ఈ విషయం బాగా తెలిసిన ప్రభుత్వ పెద్దలు టీడీపీ అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చేసుంటే సరిపోయేది. కానీ, అలాచేయకుండా కావాలనే జాప్యం చేస్తుండటంతో టీడీపీ నేతలు దీన్ని బూతద్దంలో చూపించి నానా గోలచేస్తున్నారు. లోకేష్ పాదయాత్రంటే ప్రభుత్వంలో వణుకు మొదలైందని పదేపదే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

ఒకవిధంగా టీడీపీ నేతలకు కావాల్సింది కూడా ఇదే. పాదయాత్రకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోతే దాన్ని పెద్ద ఇష్యూ చేసి జనాల్లో సానుభూతిపొందాలన్నది తమ్ముళ్ళ ప్లాన్. టీడీపీ అనుమతి అడిగిన వెంటనే ఇచ్చేసుంటే ఇక తమ్ముళ్ళు నోరెత్తటానికి ఏమీ ఉండదు. ఎక్కడికక్కడ ఏర్పాట్లుచేస్తే లోకేష్ కెపాసిటీ ఏమిటో నాలుగురోజుల్లోనే బయటపడిపోతుంది. అలాకాకుండా అనుమతులపై ఏమీ తేల్చకపోవటంతో గోలచేయటానికి టీడీపీకి అవకాశం దొరికింది. జరుగుతున్నదంతా చూస్తుంటే పాదయాత్రకు ప్రభుత్వమే ప్రచారం కల్పిస్తోందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

First Published:  21 Jan 2023 11:34 AM IST
Next Story