Telugu Global
Andhra Pradesh

పెరిగిన పర్సంటేజ్.. హామీ అమలుతో వైసీపీ మరో ముందడుగు

పేద ఆడపిల్లలున్న కుటుంబాలకు అండగా ఉండేందుకే కల్యాణ మస్తు అమలు చేస్తున్నామని చెప్పారు సీఎం జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, భవన కార్మికుల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయి.

పెరిగిన పర్సంటేజ్.. హామీ అమలుతో వైసీపీ మరో ముందడుగు
X

ఇప్పటి వరకూ ఎన్నికల హామీలను 95 శాతం అమలు చేశామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. హామీల అమలు పర్సంటేజ్ ని 98.44 శాతానికి చేర్చింది. అంటే మరో కొత్త హామీని అమలు చేయబోతోందనమాట. అక్టోబర్ -1 నుంచి ఈ కొత్త పథకం అమలులోకి వస్తుందని ప్రకటించింది ప్రభుత్వం. పేదింటి ఆడబిడ్డల వివాహ ఖర్చులకోసం సాయం చేయడానికి సిద్ధమైంది.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్టోబర్ -1 నుంచి ఏపీలో వైఎస్సార్‌ కల్యాణ మస్తు, షాదీ తోఫా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన జీఓ ప్రభుత్వం విడుదల చేసింది. పేద ఆడపిల్లలున్న కుటుంబాలకు అండగా ఉండేందుకే కల్యాణ మస్తు అమలు చేస్తున్నామని చెప్పారు సీఎం జగన్. పేద ఆడపిల్లలు గౌరవంగా పెళ్లి చేసేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, భవన కార్మికుల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయి. దివ్యాంగులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.

వైఎస్సార్‌ కల్యాణమస్తు ద్వారా ఎస్సీలకు పెళ్లి ఖర్చులకింద రూ.1లక్ష అందిస్తారు. ఎస్సీలు కులాంతర వివాహాం చేసుకుంటే లబ్ధి మొత్తం రూ.1.2లక్షలకు చేరుతుంది. బీసీలకు రూ.50వేలు, బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.75వేలు, దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే వారి వివాహానికి రూ.1.5లక్షలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ.40వేలు అందజేస్తారు. మైనార్టీలకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. షాదీ తోఫా కింద మైనార్టీల వివాహాలకు రూ.1లక్ష, ఆర్థిక సాయం అందిస్తారు. దరఖాస్తులు, ఇతర ప్రక్రియలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పూర్తి చేయొచ్చని జీఓలో పేర్కొన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలను అధికారంలోకి వచ్చిన మూడేళ్ల లోపే పట్టాలెక్కించిన సీఎం జగన్ మిగతా వాటి విషయంలోనే కాస్త వెనకాడారు. ఇటీవల సీపీఎస్ రద్దు అనే అంశం పంటికింద రాయిలా మారింది. మిగిలి పోయిన హామీల్లో ఇది కూడా ఒకటి అంటూ పదే పదే మంత్రులు కూడా ఉద్యోగులను బతిమిలాడుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ దశలో హామీల అమలు పర్సంటేజ్ ని 95 శాతం నుంచి 98.44 శాతానికి చేర్చేలా కల్యాణ మస్తు పథకం తెరపైకి తెచ్చారు. అయితే అత్యంత క్లిష్టమైన సంపూర్ణ మద్యనిషేధం హామీ విషయంలో మాత్రం ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందనే కామెంట్లు వినపడుతున్నాయి. గతంలో దశలవారీగా అన్నారు, ఆ తర్వాత అసలా హామీయే ఇవ్వలేదంటున్నారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాల అమలుతో.. ప్రజలు కూడా మద్యపాన నిషేధం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ ప్రతిపక్షాలు మాత్రం మద్య నిషేధం ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నాయి.

First Published:  11 Sept 2022 7:45 AM IST
Next Story