జగన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనా?
సుప్రీంకోర్టు తీర్పుతో కోర్టుల్లో కేసులు వేసే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండాపోయింది. కాబట్టి రుషికొండకు జగన్ తరలివెళ్ళటమే మిగిలింది.
జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకు వెళ్ళటానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనా? వైజాగ్‌లో క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేసుకుని తరలివెళ్ళటానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే తరలివెళ్ళే విషయంలో ముహూర్తాల మీద ముహూర్తాలు మారిపోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే సుప్రీంకోర్టులో కేసుండటమే. జగన్ వైజాగ్ వెళ్ళకుండా ఆపాలని టీడీపీ నేత లింగమనేని శివరామప్రసాద్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇంతకాలం ఈ కేసుపై సుప్రీంకోర్టు ఎలా తీర్పిస్తుందో అని అందరు ఆతృతగా ఎదురుచూశారు.
అయితే శుక్రవారం సుప్రీంకోర్టు కేసును కొట్టేసింది. లింగమనేని దాఖలుచేసిన పిటీషన్‌ను డిస్మిస్ చేయటం టీడీపీకి షాకనే చెప్పాలి. పైగా ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్ళద్దంటారా అని పిటీషనర్‌ను సుప్రీంకోర్టు సూటిగా నిలదీసింది. అసలు ఈ పిటీషన్లో ప్రజాప్రయోజనం ఏముందని ప్రశ్నించింది. రాజకీయ ప్రేరేపితమైన ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు ఎంటర్ టైన్ చేయదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంగా ప్రకటించింది.
తాజాగా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనమే పిటీషన్‌ను కొట్టేసిందంటే హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో పెండింగ్‌లో ఉన్న పిటీషన్లను కూడా కొట్టేయటం ఖాయమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మూడు రాజధానుల వివాదం కూడా సుప్రీంకోర్టు విచారణలోనే ఉంది. ఈ విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. టీడీపీ వేసిన కేసు పెండింగులో ఉంది కాబట్టి ఇంతకాలం జగన్ ముహూర్తాలకే పరిమితమయ్యారు. ఇపుడు కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి వీలైనంత తొందరలో వైజాగ్ షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నాయి.
రుషికొండ మీద జగన్ క్యాంపు ఆఫీసు పెట్టుకోనీయకుండా ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజానికి క్యాంపు ఆఫీసును ఎక్కడ పెట్టుకోవాలన్నది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమే. దాని ప్రకారమే జగన్ రుషికొండకు వెళ్ళాలని ప్లాన్ చేశారు. అయితే దాన్ని ప్రతిపక్షాలు ముఖ్యంగా టీడీపీ పదేపదే కేసులు వేసి అడ్డుకుంటోంది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో కోర్టుల్లో కేసులు వేసే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండాపోయింది. కాబట్టి రుషికొండకు జగన్ తరలివెళ్ళటమే మిగిలింది.