Telugu Global
Andhra Pradesh

జగన్ మొదటిసారి ఇబ్బందుల్లో పడబోతున్నారా?

ప్రజాప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న నరేంద్ర మోడీని వ్యతిరేకించాలా? లేకపోతే అవసరాలను దృష్టిలో పెట్టుకుని మోడీకే జై కొట్టాలా? అన్నది సమస్యగా మారింది. మరి జగన్ ఏమిచేస్తారో?

జగన్ మొదటిసారి ఇబ్బందుల్లో పడబోతున్నారా?
X

జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో పడబోతున్నట్లు అనిపిస్తోంది. తొందరలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమావేశాల్లో ఒక అంశం నరేంద్రమోడీకి వ్యక్తిగత ప్రతిష్టగా మారబోతోంది. ఈ నేపథ్యంలోనే మిగిలినవాళ్ళ సంగతి వదిలేస్తే జగన్‌కు ఇబ్బందులు తప్పేట్లులేదు. ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీ ప్రభుత్వం మీద అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదా లేకపోతే లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ)ను అడ్డంపెట్టుకుని ఆడిస్తున్న కేంద్ర ప్రభుత్వానిదా అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది.

ఎల్జీని అడ్డంపెట్టుకుని ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ రాచిరంపాన పెడుతున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను స్వేచ్చగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోనీయకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఎల్జీ తిరగ్గొడుతున్నారు. దాంతో వ్యవహారం కోర్టుకెక్కింది. వివాదాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలేసింది. ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎల్జీ జోక్యమెందుకని అడిగింది. ప్రతి నిర్ణయం ఎల్జీయే తీసుకునేట్లయితే ఇక ప్రజాప్రభుత్వం ఎందుకని నిలదీసింది.

ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయంలో కూడా ఎల్జీ జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదని స్పష్టంగా తీర్పిచ్చింది. దీన్ని మోడీ జీర్ణించుకోలేకపోయారు. అందుకనే ఢిల్లీకి సంబంధించిన ప్రజాసేవల్లో ఎల్జీదే అంతిమ నిర్ణయమంటు కేంద్రం ఒక ఆర్డినెన్సును జారీ చేసింది. అలాగే రివ్యూ పిటీషన్ కూడా వేసింది. తొందరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో చట్టం తీసుకొచ్చేందుకు డ్రాఫ్టు రెడీ చేస్తోంది. చట్టం చేయాలంటే ముందు బిల్లు పాసవ్వాలి.

లోక్‌సభలో ఇబ్బందిలేదు కానీ రాజ్యసభలోనే సమస్యంతా. 238 మంది సభ్యుల్లో ఎన్డీయే బలం 110 మాత్రమే. యూపీఏకి 64 మంది, ఇతర పార్టీలకు 64 మంది ఎంపీలున్నారు. ఇతర పార్టీలంటే తృణమూల్‌కు 12, ఆప్‌కు 10, బీజేడీ, వైసీపీకి చెరో తొమ్మిదున్నాయి. బీఆర్ఎస్, సీపీఎం, ఎస్పీకి కలిపి పది సీట్లున్నాయి. తృణమూల్, ఆప్, బీఆర్ఎస్, సీపీఎం ఎలాగూ కేంద్రానికి మద్దతివ్వవు. మిగిలింది బీజేడీ, వైసీపీ మాత్రమే. బీజేడీ ఏమిచేస్తుందో తెలీదు. కాబట్టి అందరి దృష్టి జగన్ పైనే ఉంది. యూపీఏ+ఇతర పార్టీలన్నీ కలిస్తే బిల్లు వీగిపోవటం ఖాయం. ప్రజాప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న నరేంద్ర మోడీని వ్యతిరేకించాలా? లేకపోతే అవసరాలను దృష్టిలో పెట్టుకుని మోడీకే జై కొట్టాలా? అన్నది సమస్యగా మారింది. మరి జగన్ ఏమిచేస్తారో?

First Published:  23 May 2023 12:21 PM IST
Next Story