Telugu Global
Andhra Pradesh

రెండుసార్లు జగన్‌కు ఎదురుదెబ్బేనా?

ఎన్నిక ఏదైనా సరే పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబాన్ని కాదని ప్రత్యర్థుల‌కు చెప్పుకోదగ్గ ఓట్లొచ్చేది చాలా తక్కువనే చెప్పాలి. అలాంటిది రెండు వరుస ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులలో ప్రత్యర్థుల‌కు ఆధిక్యత లభించంటమే ఇక్కడ చర్చనీయాంశమైంది. ఇప్పుడు గెలిచిన భూమిరెడ్డి రామ్ గోపాలరెడ్డిది కూడా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలమే.

రెండుసార్లు జగన్‌కు ఎదురుదెబ్బేనా?
X

ఇప్పుడు ఈ విషయంపైనే వైసీపీతో పాటు మామూలు జనాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ పాయింట్‌ను అడ్డంపెట్టుకునే టీడీపీ కూడా పదేపదే కవ్విస్తోంది, చాలెంజ్‌లు చేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో టీడీపీనే గెలిచినా ప్రధాన చర్చంతా పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం గెలుపు మీదే నడుస్తోంది.

పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం మీదే ఎందుకు చర్చ జరుగుతోందంటే ఇందులోనే పులివెందుల నియోజకవర్గం కూడా ఉంది కాబట్టి. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో వైసీపీ తరపున వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ తరపున భూమిరెడ్డి రామ్ గోపాలరెడ్డి పోటీ చేశారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం పరిధిలోకి కడప - కర్నూలు - అనంతపురం జిల్లాలు వస్తాయి. కాబట్టే పులివెందుల నియోజకవర్గంపై ఇప్పుడు ఇంత‌ చర్చ జరుగుతోంది.

ఎన్నిక ఏదైనా సరే పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబాన్ని కాదని ప్రత్యర్థుల‌కు చెప్పుకోదగ్గ ఓట్లొచ్చేది చాలా తక్కువనే చెప్పాలి. అలాంటిది రెండు వరుస ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులలో ప్రత్యర్థుల‌కు ఆధిక్యత లభించంటమే ఇక్కడ చర్చనీయాంశమైంది. ఇప్పుడు గెలిచిన భూమిరెడ్డి రామ్ గోపాలరెడ్డిది కూడా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలమే. ఈ ఎన్నికలో ఇక్కడ టీడీపీకే ఆధిక్యత వచ్చింది. ఇప్పుడు ఓట్లేసింది గ్రాడ్యుయేట్లే అయినా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లుపడ్డాయన్న విషయంపైనే చర్చ జరుగుతోంది.

అలాగే 2017లో కూడా టీడీపీ తరపున పోటీ చేసిన బీటెక్ రవి గెలిచారు. అప్పట్లో ఆయన స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వివేకానందరెడ్డిని ఓడించారు. బీటెక్ రవిది కూడా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలమే. అంటే రెండుసార్లు జగన్మోహన్ రెడ్డికి తన నియోజకవర్గంలోని సొంత మండలం సింహాద్రిపురంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 2014లో పార్టీ పెట్టిన దగ్గర నుండి జిల్లాతో పాటు నియోజకవర్గంలో ఎదురే లేదని అనుకుంటున్న సమయంలో రెండుసార్లు తన మండలంలోనే జగన్‌కు ఎదురు దెబ్బ తగలటం ఆశ్చర్యంగానే ఉంది. అందుకనే పులివెందులలో జగన్ పని అయిపోయిందని చంద్రబాబు, అచ్చెన్న పదే పదే అంటున్నది.

First Published:  19 March 2023 5:34 AM GMT
Next Story