నమ్ముకున్నవారే ముంచుతున్నారా?
కోటంరెడ్డి గొడవ తర్వాత పార్టీలో ఏమి జరుగుతోందో తెలుసుకునేందుకు జగన్ అర్జంట్‌గా పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాను నమ్ముకున్నవారి వల్లే సమస్యలు వస్తున్నట్లు జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం.
అధికార పార్టీలో ఇప్పుడీ పాయింట్ మీదే చర్చ జరుగుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వ్యవహారం తర్వాత వివిధ జిల్లాల్లోని అసంతృప్తులపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా నేతల మధ్య ఎప్పటి నుండో గొడవలున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లాగ తారస్థాయికి చేరుకోలేదు. కొన్ని నియోజకవర్గాల్లోని నేతల మధ్య గొడవలు వాళ్ళ ఆధిపత్య ప్రదర్శన వరకే పరిమితమైంది. కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం ట్యాపింగ్, నమ్మకద్రోహం, అవమానాలంటూ కోటంరెడ్డి ఆరోపణలన్నీ జగన్మోహన్ రెడ్డి మీదే ఎక్కుపెట్టడంతో సంచలనమైంది.
కోటంరెడ్డి గొడవ తర్వాత పార్టీలో ఏమి జరుగుతోందో తెలుసుకునేందుకు జగన్ అర్జంట్‌గా పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాను నమ్ముకున్నవారి వల్లే సమస్యలు వస్తున్నట్లు జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. కొన్ని జిల్లాలకు కలిపి కో ఆర్డినేటర్లు, రీజనల్ కోఆర్డినేటర్లను జగన్ నియమించారు. ఇదే విధంగా జిల్లాల్లో నేతల మధ్య విభేదాల పరిష్కారానికి సమన్వయకర్తలను కూడా నియమించారు.
అయితే కో ఆర్డినేటర్లు, రీజనల్ కోఆర్డినేటర్లు, సమన్వయకర్తల్లో చాలామంది పనితీరు సంతృప్తిగా లేదని జగన్ అభిప్రాయపడ్డారట. ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించేట్లుగా అందరికీ పూర్తి స్వేచ్చను ఇచ్చినా వీళ్ళంతా తమ బాధ్యతలను నిర్వర్తించటంలో ఫెయిలైనట్లు జగన్ భావించారట. కోఆర్డినేటర్లు, రీజనల్ కోఆర్డినేటర్లు సమర్థవంతంగా పనిచేసుంటే కోటంరెడ్డి గొడవ ఇంతదాకా వచ్చుండేది కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పనిలో పనిగా వివాదాలున్న ఇతర నియోజకవర్గాలపైన కూడా జగన్ దృష్టి సారించారట.
నెల్లూరుకు ఇన్‌చార్జి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అంటే బాలినేని పనితీరు మీదే జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అనుకోవాలి. అలాగే మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని లాంటి వాళ్ళకి కీలక బాధ్యతలు అప్పగించినా వీళ్ళెవరూ తమ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించలేదని జగన్‌కు రిపోర్టు అందిందట. తానెంతో నమ్మకంతో పార్టీ బాధ్యతలను అప్పగిస్తే ఇలా ఫెయిలైతే ఎలాగని జగన్ ప్రశ్నించారట. అందుకనే పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా షఫుల్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. మరి ఈ సారన్నా సమర్థవంతులను నియమించి యాక్టివ్‌గా ఉంచుతారా?