చెవిరెడ్డికి కీలక బాధ్యతలు
ఎమ్మెల్యేలపై అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉంటున్న ద్వితీయశ్రేణి నేతలను గుర్తించటం, మాట్లాడటం, బుజ్జగించి మళ్ళీ పార్టీలో యాక్టివ్ చేయించటమే చెవిరెడ్డికి ఇచ్చిన బాధ్యత.
తనకు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి జగన్మోహన్ రెడ్డి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. కొత్తగా అప్పగించిన బాధ్యతలు పూర్తిగా పార్టీ పరమైనవే. జగన్ టార్గెట్ ప్రకారం పార్టీని 175 నియోజకవర్గాల్లోనూ గెలిపించటంలో చెవిరెడ్డి బాధ్యత కీలకమైనదని అర్థమవుతోంది. ఎలాగంటే అన్నీ నియోజకవర్గాల్లోని సెకండ్ క్యాడర్ లీడర్లను గుర్తించటం, పార్టీకి చిత్తశుద్దితో పనిచేసేట్లు చేయటమే చెవిరెడ్డి బాధ్యత. ఇప్పటికే తనకిచ్చిన బాధ్యతల్లో ఎమ్మెల్యే బిజీగా ఉన్నారట.
మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలతో బాగా గ్యాప్ పెరిగిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు అంత సులభంకాదన్నది అర్థమైంది. ద్వితీయ శ్రేణి నేతల మద్దతు లేకుండా ఏ అభ్యర్థి కూడా గెలవలేరు. అందుకనే ఎమ్మెల్యేలపై అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉంటున్న ద్వితీయశ్రేణి నేతలను గుర్తించటం, మాట్లాడటం, బుజ్జగించి మళ్ళీ పార్టీలో యాక్టివ్ చేయించటమే చెవిరెడ్డికి ఇచ్చిన బాధ్యత.
ఇందుకోసం సెంట్రల్ ఆఫీసులో ఎమ్మెల్యేకి ప్రత్యేకమైన సెటప్‌ను కూడా ఏర్పాటు చేశారట. ఈ సెటప్‌తో పాటు ప్రత్యేక బృందాన్ని కూడా జగన్ అందించారు. ఈ బృందంతో రెగ్యులర్‌గా నియోజకవర్గాల్లో చెవిరెడ్డి పర్యటిస్తున్నారు. ద్వితీయశ్రేణి నేతలు, పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలతో భేటీ అవుతున్నారు. వాళ్ళ సమస్యలు ఏమిటి? ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయాలను మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పింది విని సమస్యల పరిష్కారాన్ని కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారట. అవసరమైనప్పుడు అలాంటి బలమైన నేతలతో జగన్‌తో ఫోన్లో మాట్లాడిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
పనిలో పనిగా ఎమ్మెల్యేల పనితీరుపైన కూడా సర్వేలు చేయిస్తున్నారు. ఫీడ్ బ్యాక్ ఆధారంగా ప్రత్యామ్నాయాలను కూడా చెవిరెడ్డి సూచిస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో తన పర్యటన వివరాలను ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో పార్టీ ఆఫీసుకు అందిస్తున్నారు. దాన్ని జగన్ ముందుంచుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. చెవిరెడ్డికి ఇచ్చిన బాధ్యతల్లో ఇతర నేతలెవరూ జోక్యం చేసుకోవద్దని జగన్ స్పష్టంగా చెప్పేశారట. అంటే ఒకవైపు లీడర్లను, క్యాడర్‌ను కలుపుతూనే మరో వైపు సర్వేలు చేయిస్తు, ఇంకోవైపు ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారని అర్థమవుతోంది. మొత్తానికి చెవిరెడ్డికి జగన్ అప్పగించిన బాధ్యతలు చాలా కీలకమైనవనే చెప్పాలి.