వైసీపీలో భారీ మార్పులు
ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీల్లో నలుగురైదురుకి మాత్రమే మళ్ళీ టికెట్లు దక్కే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. మిగిలినవాళ్ళల్లో కొందరిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట.
ఎన్నికల్లో నేతలను పోటీలోకి దింపేటప్పుడు అధినేతలు రకరకాల కాంబినేషన్లు, ఈక్వేషన్లను ఆలోచిస్తుంటారు. ఏ పార్టీలో అయినా ఇది చాలా సహజం. తొందరలో జరగబోయే ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీల్లో నలుగురైదురుకి మాత్రమే మళ్ళీ టికెట్లు దక్కే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. మిగిలినవాళ్ళల్లో కొందరిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట.
అలాగే ఇంకొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా రకరకాల ఈక్వేషన్లను దృష్టిలో పెట్టుకుని జగన్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని మళ్ళీ లోక్‌సభకే పోటీ చేయించటం ఖాయమైందట. మిగిలినవాళ్ళ విషయంలో జగన్ పెద్ద కసరత్తే చేస్తున్నట్లు సమాచారం.
ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటంలేదని ప్రకటించారు. అలాగే అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఇప్పటికే జగన్‌కు చెప్పారట. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఎందుకనో సఫకేటింగ్ పీలవుతున్నట్లు తెలుస్తోంది. హిందుపురం ఎంపీ మాధవ్ లాంటి కొందరిపై జనాల్లో వ్యతిరేకత కనబడుతోంది. అందుకనే వీళ్ళని అవకాశముంటే ఎమ్మెల్యేలుగానో లేకపోతే వీళ్ళసేవలు పార్టీకి ఉపయోగించుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు.
మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యవహారం కాస్త ఇంట్రెస్టింగుగా ఉంది. వైవీని జగన్ వైజాగ్ ఎంపీగా పోటీ చేయాలని అడిగారట. ఇప్పుడు ఎంపీగా ఉన్న సత్యనారాయణరావు రాబోయే ఎన్నికల్లో విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నారు. కాబట్టి వైవీని వైజాగ్ ఎంపీగా పోటీచేయిస్తే బాగుంటుందని జగన్ అనుకుంటున్నారు. అయితే వైవీ మాత్రం తాను ఒంగోలులోనే పోటీచేస్తానని అంటున్నారట. అలాగే 30 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని కూడా ప్రచారంలో ఉంది. మొత్తంమీద రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో భారీ ప్రక్షాళనయితే తప్పేట్లు లేదు.