Telugu Global
Andhra Pradesh

ద్వితీయశ్రేణి కోసం జగన్ తాజా స్కెచ్

ప్రతి నియోజకవర్గంలోను మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ కమిటీల ఛైర్మన్లలో జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలున్నారు. వీళ్ళంతా మంత్రికో లేదా ఎమ్మెల్యేకో మద్దతుదారులుగా ఉంటారు. ఇక నుండి ఇలాంటి వాళ్ళతో కూడా రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలని జగన్ అనుకున్నారట.

ద్వితీయశ్రేణి కోసం జగన్ తాజా స్కెచ్
X

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకిచ్చిందనే చెప్పాలి. తొందరలోనే కోటంరెడ్డి పార్టీని వదిలేయటం ఖాయం. అప్పుడు ఎమ్మెల్యేతో పాటు వెళ్ళిపోయేదెవరు? పార్టీలోనే ఉండేదెవరు అనే విషయమై పార్టీలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ద్వితీయశ్రేణి నేతల్లో ఎవరూ ఎమ్మెల్యేతో వెళ్ళకుండా ఆపేందుకు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి చాలా కష్టపడుతున్నారు. అయితే నెల్లూరు మేయర్ శ్రవంతితో పాటు కొందరు కార్పొరేటర్లు తామంతా కోటంరెడ్డితోనే ఉంటామని తెగేసి చెప్పారు.

కోటంరెడ్డి మద్దతుదారులతో పాటు ఇతరుల్లో కూడా చాలామంది మంత్రి, మాజీ మంత్రికి ఎదురు తిరిగారట. పార్టీలోనే ఉండటం వల్ల జరగబోయే మేలును జగన్ మాటగా బాలినేని, కాకాణి వీళ్ళకు వివరించినపుడు ఇంతకాలానికి తాము జగన్‌కు గుర్తుకొచ్చామా? అంటూ నిలదీశారట. జగనే కాదు కనీసం మంత్రి కూడా తమతో ఇప్ప‌టివరకు ఒక్కసారికూడా భేటీ కాలేదన్న విషయాన్ని కార్పొరేటర్లు గుర్తుచేశారట. దాంతో ఇదే విషయాన్ని బాలినేని జగన్ దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం.

దాంతో జగన్ ఆలోచనల్లో మార్పొచ్చిందంటున్నారు. ఇక నుంచి ద్వితీయశ్రేణి నేతలతో కూడా రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలని అనుకున్నారట. ప్రతి నియోజకవర్గంలోను మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ కమిటీల ఛైర్మన్లలో జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలున్నారు. వీళ్ళంతా మంత్రికో లేదా ఎమ్మెల్యేకో మద్దతుదారులుగా ఉంటారు. ఇక నుండి ఇలాంటి వాళ్ళతో కూడా రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాలని జగన్ అనుకున్నారట.

ప్రోటోకాల్‌లో మార్పులు చేసి జిల్లాల పర్యటనలకు వెళ్ళినపుడు ద్వితీయశ్రేణి నేతలతో కూడా భేటీ అవ్వాల్సిన అవసరాన్ని జగన్ గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటివరకు జిల్లాల పర్యటనల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లతోనే జగన్ భేటీ అవుతున్నారు. ఇకనుండి ద్వితీయశ్రేణి నేతలను కూడా పిలవాలని డిసైడ్ అయ్యారట. దీనివల్ల లాభమేమిటంటే పార్టీ వదిలి వెళ్ళిపోయే ఎమ్మెల్యేలతో సెకండ్ కేడర్ నాయకులు వెళ్ళే అవకాశాలు తగ్గిపోతాయి. జగన్ తాజా నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల్లోని సెకండ్ కేడర్ నేతల జాబితాలు రెడీ అవుతున్నాయట. మొత్తానికి నెల్లూరు గొడవ నుండి జగన్ తొందరగానే గుణపాఠం నేర్చుకున్నట్లున్నారు. మరి రిజ‌ల్ట్‌ ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  6 Feb 2023 10:42 AM IST
Next Story