సన్నిహితులే జగన్ నెత్తిన బండలేస్తున్నారా?
తమ వైఖరి వల్ల ప్రభుత్వంతో పాటు పార్టీపై నెగిటివ్ ప్రభావం పడుతుందన్న విషయం తెలిసినా పద్దతి మార్చుకోవటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. పైగా జగన్ మాటే తమ మాట, జగన్ బాటే తమ బాట అంటు ఒకవైపు చెబుతునే బండలేసేస్తున్నారు.
అధికార పార్టీలో విచిత్రమైన పరిస్ధితులు కనబడుతున్నాయి. వాస్తవాలు మాట్లాడుతున్నామని కొందరు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నామని మరికొందరు జగన్మోహన్ రెడ్డి నెత్తినే బండలేస్తున్నారు. తమ వైఖరి వల్ల ప్రభుత్వంతో పాటు పార్టీపై నెగిటివ్ ప్రభావం పడుతుందన్న విషయం తెలిసినా పద్దతి మార్చుకోవటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. పైగా జగన్ మాటే తమ మాట, జగన్ బాటే తమ బాట అంటు ఒకవైపు చెబుతునే బండలేసేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే సామాజిక పింఛన్లలో ఎవరికీ కోతపెట్టేందుకు లేదంటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి గోలగోల చేశారు. జనాలకు ఏమి మేలు చేశామని వచ్చే ఎన్నికల్లో ఓట్లడుగుతామంటూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి జగన్నే ప్రశ్నించారు. జగన్ ఏమనుకున్నా సరే మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మీద పైచేయి సాదించటమే తన టార్గెట్ అన్నట్లుగా మాజీ మంత్రి అనిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఇక కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే నోటికి ఎంతొస్తే అంట మాట్లాడేస్తారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, పెడన ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ మధ్య విభేదాలు రోడ్డున పడిపోయాయి. హిందుపురం సమన్వయకర్త చౌళూరి రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాలే హత్య చేయించారంటు పార్టీలో జరుగుతున్న గొడవ గురించి చెప్పాల్సిన అవసరమేలేదు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిపై సొంత తమ్ముడే తిరుగుబాటు చేసి మధ్యలో జగన్‌ను వివాదాల్లోకి లాగుతున్నారు. మడకశిర నేతలు ఎమ్మెల్యే తిప్పేస్వామిపై తిరుగుబాటు లేవదీశారు.
వీళ్ళ తిరుగుబాటు ఎంతదాకా వెళ్ళిందంటే తిప్పేస్వామికి మళ్ళీ టికెట్ ఇస్తే ఓడగొడతామని ఏకంగా జగన్‌కే అల్టిమేటమ్ ఇస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి - ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌కు ఒక నిమిషం కూడా పడట్లేదు. తనపై ఎమ్మెల్యే హత్యాప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ బహిరంగంగా చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. ఇలా కొంతమంది బహిరంగంగా చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నా తమ వైఖరిని ఏమాత్రం మర్చుకోవటం లేదు. వీళ్ళందరిలో ఆనం తప్ప మిగిలిన వాళ్ళంతా జగన్‌కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడినవారే.