Telugu Global
Andhra Pradesh

ఏపీలో మంత్రులంతా వెనుకంజ..! ఎందుకిలా..?

వైనాట్ 175 అంటే అతిశయోక్తి అనుకున్నారు కానీ.. జగన్ కేబినెట్ కూడా ఓటమి దిశగా పయనిస్తుందని ఎవరూ ఊహించలేదు.

ఏపీలో మంత్రులంతా వెనుకంజ..! ఎందుకిలా..?
X

ఏపీ ఫలితాలకు సంబంధించి క్లియర్ పిక్చర్ వచ్చినట్టే తెలుస్తోంది. వైసీపీ ఆశించిన ఫలితాలు రావట్లేదు. అదే సమయంలో జగన్ కేబినెట్ లోని కీలక నేతలకు కూడా పెద్ద చిక్కొచ్చిపడింది. మంత్రుల పరిస్థితి చూస్తుంటే, సీనియర్లకు కూడా ఈసారి షాక్ తగిలేలా ఉంది. మూడు రౌండ్ల తర్వాత సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చీపురుపల్లిలో వెనకంజలో ఉన్నారు. జగన్ ప్రమాణ స్వీకారం విశాఖలోనే, జూన్-9న ముహూర్తం అని ఖాయంగా చెప్పిన బొత్స వెనకపడటంతో ఉత్తరాంధ్ర వైసీపీ శ్రేణులు డీలాపడ్డాయి.

మంత్రి పెద్దిరెడ్డి కూడా ఓ దశలో వెనకపడటం ఏపీ ఫలితాల్లో మరో ట్విస్ట్. రోజా, అంబటి రాంబాబు వంటి ఒకరిద్దరు మంత్రుల విషయంలో సోషల్ మీడియా కాస్త ముందుగానే ఫలితాల్ని అంచనా వేసింది. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తే అంతకు మించి మంత్రుల్లో చాలామందికి బ్యాడ్ టైమ్ కొనసాగుతోందని చెప్పాలి. కాకాణి లాంటి ఒకరిద్దరి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.

ఎన్నికల రోజు కూడా వైసీపీలో చాలామంది నేతలు గెలుపు ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత మాత్రం చాలామంది డీలా పడ్డారు. వైసీపీ గెలుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ కూడా మంత్రుల్లో కొందరు ఓడిపోతున్నారని పేర్లతో సహా లిస్ట్ విడుదల చేశారు. ఆ లిస్ట్ లో ఉన్నవారు ముందుగానే డీలాపడగా.. ఇప్పుడు మరికొందరు వారికి జతకలిశారు. వైనాట్ 175 అంటే అతిశయోక్తి అనుకున్నారు కానీ.. జగన్ కేబినెట్ కూడా ఓటమి దిశగా పయనిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇలాంటి ఊహించని పరిణామాలన్నీ ఏపీ ఫలితాల్లో కనపడుతున్నాయి.

First Published:  4 Jun 2024 10:23 AM IST
Next Story