Telugu Global
Andhra Pradesh

అది చంద్ర‌బాబు అమ‌రావ‌తి.. ఇది జ‌గ‌న్ అమ‌రావ‌తి

చంద్రబాబును కమ్మోరు ఓన్ చేసుకున్నట్లు రెడ్లు జగన్ను ఓన్ చేసుకోలేదు. ఎందుకంటే జగన్ ఏ అవకాశం వచ్చినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలని జపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కారణంగా చంద్రబాబు అమరావతి కాన్సెప్టు బద్దలైంది.

అది చంద్ర‌బాబు అమ‌రావ‌తి.. ఇది జ‌గ‌న్ అమ‌రావ‌తి
X

ఇంతకాలం చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్న అమరావతి కాన్సెప్టును జగన్మోహన్ రెడ్డి బద్దలు కొట్టేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలుండకూడదని చంద్రబాబు అండ్ కో ఎంత వ్యతిరేకించారో, కోర్టుల్లో కేసులేసి ఎంతగా ప్రతిఘటించారో అందరికీ తెలిసిందే. అలాంటిది శుక్రవారం ఒకేసారి 50,793 మంది పేదలకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయటం ద్వారా చంద్రబాబు మార్క్ అమరావతిని బద్దలుకొట్టినట్లయ్యింది. అందుకనే జగన్ మాట్లాడుతూ.. ఇది చంద్రబాబు చెప్పే అమరావతి కాదని ఇక నుండి సామాజిక అమరావతిగా అభివర్ణించారు.

సామాజిక వర్గాలంటే చంద్రబాబు నిర్వచనానికి జగన్ చెప్పే నిర్వచనానికి చాలా తేడాలున్నాయి. జగన్ చెప్పే సామాజిక వర్గాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. అదే పద్దతిలో ఇప్పుడు ఇళ్ళ పట్టాల పంపిణీ కూడా జరిగింది. పట్టాలు అందుకున్న లబ్ధిదారుల్లో అత్యధికంగా బీసీలు 26,869 మంది ఉన్నారు. ఎస్సీలు 8495 మంది, ఎస్టీలు 1579 మంది, అగ్రవర్ణాల్లోని పేదలు 13,850 మంది ఉన్నారు. ఇప్పటివరకు ఎక్కువగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లే ఇప్పుడు ఇళ్ళ పట్టాల పంపిణీలో కూడా బీసీలకే టాప్ ప్రయారిటి ఇచ్చారు.

చంద్రబాబు చెబుతున్నట్లు ఇప్పుడు కూడా అమరావతి గ్రామాల్లో అన్నీ సామాజిక వర్గాలు ఉన్నాయనటంలో సందేహం లేదు. అయితే ఎన్ని సామాజిక వర్గాలున్నా వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న సామాజికవర్గం ఏది అన్నదే కీలకమైనది. నిజానికి హైదరాబాద్ నుండి పారిపోయి విజయవాడ కరకట్ట మీదకు చంద్రబాబు చేరుకునేంతవరకు రాజధాని గ్రామాల్లో సామాజిక వర్గాల సమస్య లేదనే చెప్పాలి. అందరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవారు.

ఎప్పుడైతే చంద్రబాబు కరకట్ట మీదకు చేరుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించారో అప్పటి నుండి గ్రామాల్లో సీన్ మారిపోయింది. కమ్మ సామాజికవర్గం నేతల ఆధిపత్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. అది బాగా పెరిగి పెరిగి మహావృక్షంగా మారి 2019 ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించేంత వరకు కంటిన్యూ అయ్యింది. ఇక్కడే చంద్రబాబు చెప్పే సామాజిక వర్గాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ చెబుతున్న సామాజిక వర్గాలకు తేడా స్పష్టంగా బయటపడింది. చంద్రబాబును కమ్మోరు ఓన్ చేసుకున్నట్లు రెడ్లు జగన్ను ఓన్ చేసుకోలేదు. ఎందుకంటే జగన్ ఏ అవకాశం వచ్చినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలని జపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కారణంగా చంద్రబాబు అమరావతి కాన్సెప్టు బద్దలైంది.

First Published:  27 May 2023 11:12 AM IST
Next Story